
కొత్తిమీర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏ వంటకం చేసినా చివరలో కొత్తిమీర వేస్తే వచ్చే ఆ రుచే వేరు. కొత్తిమీరతో కూడా ఎన్నో రకాల వంటలు తయారు చేయవచ్చు. కొత్తిమీర రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.

కొత్తిమీర ఒక అద్భుతమైన క్రిమినాశక. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది. భోజనం తిన్న తర్వాత రెండు కొత్తిమీర ఆకులను బాగా నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.

కొత్తిమీర తిన్నా, కొత్తిమీర రసం తీసుకున్నా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో త్వరగా వ్యాధుల బారి నుంచి బయట పడొచ్చు. అంతేకాకుండా వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.

కొత్తిమీర నీరు మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర నీరు తక్కువ కేలరీల పానీయం. ఇది జీవక్రియను పెంచుతుంది. కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కాలక్రమేణా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

కొత్తిమీరలో ప్రశాంతత కలిగించే లక్షణాలు ఉన్నాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అందుకే రాత్రిపూట దీన్ని తాగడం వల్ల నాడీ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.