
ఇడ్లీ విషయానికి వస్తే.. దీని వల్ల శరీరానికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీలను కేవలం ఆవిరిపైనే ఉడికిస్తారు కాబట్టి వీటిలో కొవ్వు శాతం అస్సలు ఉండదు. నూనె వాడకపోవడం వల్ల క్యాలరీలు పెరగకుండా పోషకాలు అలాగే అందుతాయి. దీని పిండిని బాగా పులియబెట్టడం వల్ల ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి పోషకాలను త్వరగా గ్రహించేలా చేస్తుంది. ఇడ్లీలు చాలా తేలికగా ఉండి, సులభంగా అరుగుతాయి కాబట్టి.. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అలాగే వర్కవుట్స్ చేసేవారికి, అనారోగ్యం నుండి కోలుకునేవారికి ఇది ఒక ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్.

మరోవైపు దోశ కూడా శరీరానికి తగిన శక్తిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దోశ తింటే కడుపు నిండిన అనుభూతి కలిగి, త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. దోశల్లో రకరకాల కూరగాయలు లేదా పనీర్, కోడిగుడ్డు వంటి ప్రొటీన్లను జోడించి వెరైటీగా, మరింత పౌష్టికాహారంగా మార్చుకునే వీలుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల శరీరానికి రోజంతా అవసరమైన స్థిరమైన శక్తి లభిస్తుంది. అందువల్ల ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారికి లేదా శారీరక శ్రమ ఎక్కువ చేసేవారికి దోశ ఒక పర్ఫెక్ట్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

ఇడ్లీ, దోశలలో ఏది అత్యంత ఆరోగ్యకరమైనది? అనే ప్రశ్నకు సమాధానం మన ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలని చూస్తూ, తక్కువ క్యాలరీలు, కొవ్వు లేని తేలికపాటి ఆహారం కోరుకుంటే ఇడ్లీయే బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటూ, రోజంతా చురుగ్గా ఉండటానికి కావలసిన శక్తి కావాలనుకుంటే దోశను ఎంచుకోవచ్చు. ఈ రెండింటినీ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సాంబార్ లేదా పౌష్టికమైన చట్నీలతో కలిపి తిన్నప్పుడు మాత్రమే సంపూర్ణ పోషకాలు అందుతాయి. కాబట్టి మనం తినే పరిమాణాన్ని బట్టి, వండే పద్ధతిని బట్టి వీటి ఫలితాలు ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ రెండు అల్పాహారాలు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ బాధితులకు ఇడ్లీ చాలా మంచిది. ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పిండి పులియడం వల్ల కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు తక్కువ క్యాలరీలు ఉండే ఇడ్లీని లేదా చాలా తక్కువ నూనెతో, ప్రొటీన్ల సాయంతో చేసిన దోశలను పరిమిత పరిమాణంలో తింటే మంచి ఫలితం ఉంటుంది.

గ్లూటెన్ అలర్జీ లేదా సెలియాక్ వ్యాధి ఉన్నవారికి ఇడ్లీ, దోశలు ఒక అద్భుతమైన వరం. ఇవి సహజంగానే గ్లూటెన్ ఫ్రీ ఆహారాలు. బియ్యం, పప్పుల మిశ్రమంతో చేయడం వల్ల ఎలాంటి జీర్ణకోశ సమస్యలు రాకుండా హాయిగా వీటిని ఆస్వాదించవచ్చు. మీరు వీటిని ఇంట్లోనే స్వయంగా వండుకున్నా, లేదా సమయం లేనప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకున్నా.. మితిమీరి తినకుండా, సరైన పరిమాణంలో తిన్నప్పుడే వీటి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని నిపుణులు సూచిస్తున్నారు.