
మన రోజువారీ పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బట్టలపై టీ, కాఫీ మరకలు పడుతుంటాయి. అలాగే వంట చేస్తున్న సమయంలో గ్రేవీ మరకలు, పిల్లలు తింటున్నప్పుడు కూర మరకలు పడుతుంటాయి.ఎన్నిసార్లు ఉతికినా అంత సులభంగా తొలగిపోవు. కొన్నిసార్లు బట్టల రంగు మారుతుందేమో కానీ మరకలు మాత్రం అలాగే ఉండిపోతాయి. దీంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లోనే ఉండే వాటితోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. మరి, ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన బట్టలపై టీ లేదా కాఫీ మరకలు పడినప్పుడు వెంటనే వాటిపై వేడి నీళ్లు పోయకూడదు. వేడి నీళ్లు పోయడం వలన ఈ మరకలు బట్టలకు మరింత గట్టిగా అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా చల్లని నీటితో మరక ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మరక ఉన్న చోట ఒక స్పూను బేకింగ్ సోడా వేసి బ్రష్‌తో ఐదు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తరవాత కొద్దిగా షాంపూ వేసి మరో ఐదు నిమిషాల పాటు రుద్ది చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల టీ లేదా కాఫీ మరకలు పోతాయి.

మనం వంట చేస్తున్నప్పుడు బట్టలపై గ్రేవీ మరకలు పడుతుంటాయి. అలాగే పిల్లలు తినేటప్పుడు కూడా బట్టలపై కూర ఒలికిపోతూ ఉంటుంది. ఇలాంటి మరకలను తొలగించడానికి ముందుగా మరక పడిన చోట సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మరక ఉన్న చోట కొద్దిగా వెనిగర్ వేసి ఐదు నిమిషాల పాటు రుద్దాలి. ఇలా రుద్ది నీటితో కడిగేయాలి.

కొన్నిసార్లు బట్టలపై టీ ఒలికినప్పుడు వెంటనే శుభ్రం చేయకుండా రెండు మూడు రోజులు అలాగే వదిలేస్తుంటాం. దీంతో అవి మొండి మరకలుగా మారిపోతాయి. అలాంటప్పుడు ముందుగా బట్టలను వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తర్వాత బ్రష్‌తో మరక ఉన్న చోట రుద్ది నీటితో కడగాలి. తర్వాత ఆ ప్రదేశంలో ఉప్పు వేసి నిమ్మరసం పిండి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.

పైన చెప్పిన చిట్కాలను పాటించండి మీఇంట్లో ఉండే వస్తువులతో బట్టలపై పడిన మరకలను తొలగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే బట్టలపై వెంటనే పడిన టీ మరకలను చల్లని నీళ్లతో కడగాలి. ఎండిన మరకలను శుభ్రం చేసేటప్పుడు బట్టల రకాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.