
పచ్చి ఆలుగడ్డ ముక్కలు: లిక్విడ్ రూపంలో ఉండే వంటకాలకే కాకుండా కొద్దిగా సెమీ గ్రేవీగా ఉండే చికెన్, మటన్ లేదా వెజ్ కుర్మాలలో కూడా ఈ చిట్కా అద్భుతంగా సెట్ అవుతుంది. ఒక పచ్చి ఆలుగడ్డను తీసుకుని శుభ్రంగా కడిగి, తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు ఎక్కువైన కూరలో వేసి మూత పెట్టి, కనీసం 15 నిమిషాల పాటు తక్కువ మంటపై మగ్గనివ్వాలి. వడ్డించే ముందు ఆ బంగాళాదుంప ముక్కలను కూరలోంచి తీసేయవచ్చు. బంగాళాదుంపకు ఉప్పు, నీటిని త్వరగా అబ్జార్బ్ చేసుకునే సహజ గుణం చాలా ఎక్కువ. ఇది కూర రుచిని మార్చకుండా ఉప్పును లాగేస్తుంది.

పెరుగు : మసాలా దట్టించిన నార్త్ ఇండియన్ స్టైల్ గ్రేవీలు, కాజూ కర్రీలు లేదా పన్నీర్ కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఈ చిట్కా ఒక వరం లాంటిది. కూర క్వాంటిటీని బట్టి రెండు నుండి మూడు స్పూన్ల చిక్కటి గడ్డ పెరుగును గానీ గానీ బాగా బ్లెండ్ చేసి కూరలో కలపాలి. పెరుగు కలిపిన తర్వాత కూరను మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. జస్ట్ సిమ్‌లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచి దించేయాలి. ఇది ఉప్పు తీవ్రతను తగ్గించడమే కాకుండా కూర గ్రేవీని మరింత రిచ్‌గా, చిక్కగా మార్చి హోటల్ స్టైల్ టేస్ట్‌ను తెచ్చిపెడుతుంది.

నిమ్మరసం - టమాటా రసం: సైన్స్ ప్రకారం పులుపు అనేది ఉప్పు తీవ్రతను న్యూట్రలైజ్ చేస్తుంది. ఫ్రైలు లేదా డ్రై కర్రీస్‌లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఈ చిట్కా బాగా హెల్ప్ అవుతుంది. వంటకాన్ని బట్టి అర చెక్క లేదా ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఒకవేళ గ్రేవీ కూరలైతే కొద్దిగా టమాటాలను మిక్సీ పట్టి ఆ రసాన్ని వేసి కాసేపు ఉడికించాలి. పులుపు యాడ్ అవ్వడం వల్ల ఉప్పు తాలూకు ఘాటుదనం నాలుకకు అంతగా తెలియదు. పైగా వంటకానికి చక్కటి చట్‌పటా టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా కూరలో కేవలం అర చెంచా చక్కెర లేదా కొన్ని చుక్కల తేనె వేసి బాగా కలపాలి. తీపి, ఉప్పు కలిసి ఒకదానినొకటి బ్యాలెన్స్ చేసుకుంటాయి.

చపాతీ పిండి ముద్దలు: ఇది మన అమ్మమ్మల కాలం నాటి నుండి వస్తున్న అత్యంత పాతది, పక్కాగా పనిచేసే చిట్కా. పప్పులు, సాంబారు, రసం లేదా పలచటి గ్రేవీ కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైనప్పుడు ఇది అద్బుతంగా పనిచేస్తుంది. గోధుమ పిండిని కొద్దిగా తీసుకుని నీళ్లతో ముద్దగా కలుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ముద్దలుగా చేసి, మరుగుతున్న కూరలో వేయాలి. ఆ పిండి ముద్దలను కూరలోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఆ తర్వాత ఆ ముద్దలను స్పూన్‌తో బయటకు తీసి పారేయాలి. ఈ గోధుమ పిండి ముద్దలు కూరలోని అదనపు ఉప్పును మ్యాగ్నెట్‌లా పూర్తిగా పీల్చేస్తాయి.

మరిగే వేడి నీళ్లు: చారు, పప్పుచారు, సాంబారు, చికెన్ షేర్వా వంటి పలచటి ఐటమ్స్‌లో ఉప్పు ఎక్కువైతే కళ్ళు మూసుకుని ఈ పని చేయవచ్చు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఉప్పు ఎక్కువ కాగానే నార్మల్ చల్లటి నీళ్లు పోస్తుంటారు. అలా చేస్తే వంటకం చప్పగా అయిపోయి రుచి పాడవుతుంది. అలా కాకుండా పక్కన స్టవ్ మీద నీళ్లను బాగా మరిగించి, ఆ వేడి నీళ్లను సాంబారులో కలపాలి. మరిగే నీళ్లు కలపడం వల్ల వంటకం టెంపరేచర్ మారదు, కుకింగ్ ప్రాసెస్ దెబ్బతినదు. కేవలం ఉప్పు శాతం మాత్రమే ఈజీగా తగ్గిపోతుంది.