
మన ఇంట్లో నిమ్మకాయలు నిత్యం అవసరమయ్యే ముఖ్యమైన పదార్థం. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. నిమ్మకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన కొద్ది రోజులకే అవి ఎండిపోవడం, రసం తగ్గిపోవడం లేదా బూజు పట్టడం జరుగుతుంది. బయట ఉంచినా, ఫ్రిజ్‌లో ఉంచినా సరైన పద్ధతి పాటించకపోతే నిమ్మకాయలు త్వరగా పాడవుతాయి. కొన్ని సులువైన గృహ చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయలను నెల రోజుల వరకు ప్లాస్టిక్ లేదా గాజు పాత్రల్లో చాలా తాజాగా ఉంచుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

నీటిలో ముంచి నిల్వ చేయడం : నిమ్మకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఇది అత్యంత సమర్థవంతమైన పద్ధతి. ఒక గాజు జార్ లేదా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో శుభ్రమైన నీరు పోయాలి. నిమ్మకాయలను నీటిలో పూర్తిగా మునిగేలా వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ పద్ధతి వల్ల నిమ్మకాయలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి పాత నీటిని తీసివేసి కొత్త నీటిని పోస్తూ ఉంటే నిమ్మకాయలు 30 నుండి 45 రోజుల వరకు అప్పుడే చెట్టు నుంచి కోసినంత తాజాగా ఉంటాయి.

జిప్‌లాక్ బ్యాగ్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్: నిమ్మకాయలను తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత వాటిని గాలి చొరబడని జిప్‌లాక్ కవరులో లేదా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనివల్ల ఫ్రిజ్‌లోని చల్లని గాలి నేరుగా నిమ్మకాయ తొక్కకు తగలకుండా ఎండిపోకుండా కాపాడుతుంది.

నిమ్మరసం ఐస్ క్యూబ్స్: నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి రసాన్ని పిండి, ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో గడ్డకట్టించాలి. ఆ ఐస్ క్యూబ్‌లను ఒక డబ్బాలో వేసి ఫ్రీజర్‌లో ఉంచితే కావలసినప్పుడు వంటల్లోకి లేదా పానీయాల్లోకి సులువుగా వాడుకోవచ్చు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల నిమ్మకాయలు వృథా కాకుండా ఎక్కువ కాలం ఉపయోగపడతాయి.

నూనె రాయడం: ఒకవేళ మీరు నిమ్మకాయలను ఫ్రిజ్‌లో కాకుండా బయట ఉంచాలనుకుంటే, వాటి తొక్కపై కొద్దిగా వంటనూనె లేదా కొబ్బరినూనె రాసి గాలి తగిలే బుట్టలో ఉంచితే వారం నుంచి పది రోజుల వరకు ఎండిపోకుండా ఉంటాయి.