
మజ్జిగ: మనకు మజ్జిగ ఎంత చలవస్తుందో, కరివేపాకు మొక్కకు కూడా అంతే బలాన్నిస్తుంది. కరివేపాకు మొక్కలు సహజంగానే కొంచెం ఆమ్ల గుణం ఉన్న నేలలో బాగా పెరుగుతాయి. పుల్లటి మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ మరియు నత్రజని పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు పుల్లటి మజ్జిగను పది గ్లాసుల నీటిలో కలిపి, నెలకు ఒకసారి మొక్క మొదట్లో పోయాలి. ఇది నేల యొక్క pH స్థాయిని క్రమబద్ధీకరించి, వేర్లు పోషకాలను వేగంగా గ్రహించేలా చేస్తుంది. ఫలితంగా ఆకులు ముదురు పచ్చగా, నిగనిగలాడుతూ కనిపిస్తాయి.

మొక్క గుబురుగా మారాలంటే: కరివేపాకు మొక్క స్వభావరీత్యా నిలువుగా పెరగడానికి ఇష్టపడుతుంది. కానీ మనకు కావాల్సింది ఎక్కువ ఆకులు, అంటే ఎక్కువ కొమ్మలు. చాలామంది ఆకులను కింది నుండి కోస్తుంటారు. దీనివల్ల మొక్క పైన సన్నగా, పొడవుగా పెరుగుతుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాని పైభాగాన్ని తుంచేయాలి. దీనినే పించింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఆక్సిన్ అనే హార్మోన్ ప్రవాహం మారి, పక్కల నుండి కొత్త రెమ్మలు వస్తాయి. మీరు ఎంత ఎక్కువగా పైన కత్తిరిస్తే, మొక్క అంత వెడల్పుగా, దట్టంగా తయారవుతుంది.

ఎండ - మొక్కకు అసలైన ఆహారం: కరివేపాకు ఉష్ణమండల మొక్క. దీనికి తగినంత వేడి, వెలుతురు లేకపోతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. కనీసం 5 నుండి 6 గంటల ఎండ తగిలే చోట మాత్రమే కుండీని ఉంచాలి. నీడలో పెరిగే మొక్కలు బలహీనంగా ఉండి, చీడపీడల బారిన పడే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా కరివేపాకు మొక్కలు చనిపోవడానికి ప్రధాన కారణం ఓవర్ వాటరింగ్ మట్టి పై పొరను వేలితో తాకి చూడండి. అది పూర్తిగా పొడిగా అనిపిస్తేనే నీరు పోయండి.

ఇంట్లోనే సహజ ఎరువులు : ఖరీదైన కెమికల్ ఎరువుల కంటే వంటింటి వ్యర్థాలే మేలు. బియ్యం లేదా పప్పులు కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పోయండి. ఇందులో ఉండే స్టార్చ్ మొక్కకు శక్తినిస్తుంది. కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలతో చేసిన సేంద్రియ ఎరువును మూడు నెలలకు ఒకసారి మట్టిలో కలపండి. ఇది మొక్కకు అవసరమైన అన్ని రకాల సూక్ష్మ పోషకాలను అందిస్తుంది.

చీడపీడల నుండి రక్షణ: కరివేపాకు మొక్కకు నీరు చాలా తక్కువగా పోయాలి. ఒకవేళ ఆకులపై తెల్లటి మచ్చలు లేదా పురుగులు కనిపిస్తే, వేప నూనె ద్రావణాన్ని స్ప్రే చేయడం వల్ల మొక్కను కాపాడుకోవచ్చు. కరివేపాకు మొక్కను పెంచడం అనేది ఒక కళ. నిపుణులు చెప్పినట్టుగా కేవలం కొద్దిపాటి మజ్జిగ, సరైన కత్తిరింపు పద్ధతి ఉంటే చాలు.. మీ పెరడు సువాసనలతో నిండిపోతుంది. రసాయనాలు లేని సేంద్రియ కరివేపాకుతో మీ వంటల రుచిని రెట్టింపు చేసుకోండి..