
సాధారణంగా మనం బరువు తగ్గడం అంటే కేవలం శరీరంలోని నీటి శాతం లేదా కండరాల బరువు తగ్గడం కాదు, లోపల నిల్వ ఉన్న వాస్తవ కొవ్వు కరగాలి. అంజలి సచన్ వివరణ ప్రకారం.. శరీరంలో శక్తి రూపంలో నిల్వ ఉండే 1 కిలో కొవ్వు సుమారు 7,700 కేలరీలకు సమానం. ఒకసారి ప్రణాళికాబద్ధంగా కష్టపడి ఈ 7,700 కేలరీల కొవ్వును గనుక శరీరం నుండి కరిగించగలిగితే, అది మళ్ళీ అంత త్వరగా తిరిగి రాకుండా శాశ్వతంగా మాయమవుతుంది.

వాకింగ్ ద్వారా మనం ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తామనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం నడిచేటప్పుడు శరీరం కండరాల కదలికలకు, బ్యాలెన్స్ కోసం, అలాగే హృదయ స్పందనను స్థిరంగా ఉంచడానికి అంతర్గతంగా శక్తిని వాడుకుంటుంది. ఈ లెక్కన మనం వేసే ప్రతి 1000 అడుగులకు మన శరీరంలో దాదాపు 50 నుండి 70 కేలరీల వరకు కొవ్వు బర్న్ అవుతుందని ఫిట్‌నెస్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ సమీకరణాల ప్రకారం చూస్తే.. ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఒక కిలో కొవ్వును తగ్గించుకోవడానికి సగటున 1,28,000 నుండి 1,50,000 అడుగులు నడవాల్సి ఉంటుంది. ఈ సంఖ్య వినడానికి చాలా పెద్దదిగా అనిపించినా, దీనిని రోజువారీ లక్ష్యంగా మార్చుకుంటే చాలా సులభం అవుతుంది. ప్రతి రోజూ 10 వేల నుంచి 15 వేల అడుగులు నడవడం అలవాటు చేసుకుంటే, కేవలం 10 నుంచి 12 రోజుల్లోనే ఎలాంటి కఠినమైన వర్కవుట్స్ లేకుండానే ఒక కిలో బరువు తగ్గొచ్చు.

తీవ్రమైన వ్యాయామాలతో పోలిస్తే నడక ఎందుకు ఉత్తమమైనదో కూడా అంజలి సచన్ వివరించారు. కఠినమైన వర్కవుట్స్ చేస్తే ఆకలి ఎక్కువగా వేసి మళ్లీ ఎక్కువ ఆహారం తినే ప్రమాదం ఉంది. కానీ నడక వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. అలాగే ఇది మహిళల్లో హార్మోన్ల సమతుల్యతపై లేదా ఋతు చక్రంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. దీంతో పాటు నడక వల్ల అలసట కలగకపోగా, మానసిక ప్రశాంతత లభించి మెదడు చురుగ్గా మారుతుంది.

జిమ్‌కి వెళ్లి భారీ బరువులు ఎత్తలేమని, డైటింగ్ చేయలేమని బాధపడేవారికి క్రమం తప్పకుండా నడవడం అనేది ఒక అద్భుతమైన వరం లాంటిది. బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు కాబట్టి రోజువారీ అలవాట్ల ద్వారానే స్థిరమైన ఫలితాలు వస్తాయి. అందుకే ప్రతిరోజూ లక్ష్యంగా అడుగులు వేస్తూ, సరైన పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన రీతిలో ఫిట్‌గా మారడం మీ చేతుల్లోనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.