
ప్రోటీన్ పవర్: బరువు తగ్గడానికి డైట్ పాటించే ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఒకవేళ మీరు జిమ్‌కు వెళ్తూ లేదా తీవ్రమైన వ్యాయామాలు చేస్తూ ఉంటే, మీ శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు ఇలా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తిన్నప్పుడు, శరీరంలో ఆకలిని కలిగించే గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల కడుపు నిండినట్లు అనిపించి, అనవసరంగా అతిగా తినడాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారు గుడ్డు సొనలను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. గుడ్డులోని తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కానీ పచ్చసొనలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, డి, ఇ, బి12 లతో పాటు ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కోలిన్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. చాలా మంది గుడ్డు సొనలో కొలెస్ట్రాల్ ఉంటుందని భయపడతారు. అయితే మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ మన రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అంత త్వరగా ప్రభావితం చేయదని పరిశోధనలు చెబుతున్నాయి.

మీకు ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు వంటి సమస్యలు ఉంటే మాత్రం, మీ డాక్టర్ సూచించిన విధంగా మాత్రమే గుడ్డు సొన పరిమాణాన్ని తగ్గించుకోవాలి. అలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు, రోజుకు ఒక గుడ్డు సొన తినడం వల్ల బరువు తగ్గడానికి ఎలాంటి ఆటంకం కలగదు, పైగా శరీరానికి అవసరమైన మంచి శక్తి లభిస్తుంది.

కేవలం గుడ్లు తినడం వల్ల మాత్రమే బరువు తగ్గరు, వాటిని మీరు ఏ విధంగా వండుతున్నారు అనేదానిపైనే అసలు ఫలితం ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం అల్పాహారంతో పాటు ఉడికించిన గుడ్లు తినడం అత్యంత ఉత్తమం. ఇది రోజంతా శరీర జీవక్రియను చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది.

కొంతమందికి ఆమ్లెట్ అంటే ఇష్టం. దీంతో ఉడబెట్టి కాకుండా ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. ఒకవేళ మీకు ఆమ్లెట్ తినాలనిపిస్తే, దానిని నాన్ స్టిక్ పాన్‌పై కొద్దిగా ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె మాత్రమే ఉపయోగించి తయారు చేసుకోవడం మంచిది. నూనె ఎక్కువగా వాడితే, గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయని గుర్తుంచుకోవాలి.