
నరసాపురం వీధుల్లో 1947 నాటి వింటేజ్ కారు చక్కర్లు కొడుతోంది. స్థానికంగా జరిగిన ఒక వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో ఈ వింటేజ్ కారు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన వివాహ వేడుకను మరింత ఘనంగా, రాయల్‌గా మార్చేందుకు ఈ అరుదైన వాహనాన్ని ప్రత్యేకంగా రాజమహేంద్రవరం నుంచి అద్దెకు తీసుకువచ్చారు.

చరిత్రను కళ్ళకు కట్టే ఈ 1947 రోల్స్ రాయిస్ కారు, నేటి తరం అధునాతన మోడళ్లను సైతం తలదన్నేలా ఉండటం గమనార్హం. ఎర్రటి రంగుతో తళతళలాడుతూ, ఆధునిక హంగులను అద్దుకున్న ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే చూపరులు కళ్ళు తిప్పుకోలేకపోయారు.

సాధారణంగా సినిమాల్లోనో లేక మ్యూజియాల్లోనో కనిపించే ఇలాంటి వింటేజ్ వాహనం నేరుగా తమ కళ్ళ ముందు ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కారు వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకునేందుకు జనం పోటీ పడ్డారు. ముఖ్యంగా యువత, చిన్నారులు ఈ పాత కాలపు కారు విశేషాలను అడిగి తెలుసుకుంటూ, దాని అందాన్ని తమ కెమెరాల్లో బంధించారు.

వివాహ ఊరేగింపుకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ రోల్స్ రాయిస్ నరసాపురంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. మారుతున్న కాలంతో పాటు శుభకార్యాల్లో కూడా వైవిధ్యం కోరుకుంటున్న నేటి తరం, ఇలాంటి పాత కాలపు వింటేజ్ వాహనాలపై ఆసక్తి చూపుతోంది. గుర్రం రధాలు , ఎడ్ల బండ్లు ఇలా చాలారకాల వాహనాలు పెళ్లి ఊరేగింపులో ఇటివల కాలంలో చోటు దక్కిన్చుకుంటున్నాయి .

అదేసమయంలో వధూవరులను తమ తమ సతికి తగినట్టు కార్లపైనా ప్రదర్సంగా పెండ్లి మండపాలకు తీసుకొనివేలుతున్నారు. తణుకు , రాజమహేంద్రవరం వంటి నగరాల నుండి ఇలాంటి అరుదైన వాహనాలను అద్దెకు తెప్పించుకుని తమ వేడుకలను చిరస్మరణీయంగా మార్చుకుంటున్నారు.