
ఇటీవల ముంబైలో ఓ కుటుంబం రాత్రి పుచ్చకాయ బిర్యానీ తిని తెల్లారే సరికి.. ఆ కుటుంబం మొత్తం మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబ సభ్యులు తిన్న పుచ్చకాయలో ఎలుకల సంహారక మందు అయిన జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడైంది.

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కాబట్టి కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి కల్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లను అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్య శాఖ విరివిగా పలు ప్రాంతాల్లో తనిఖీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారనే అనుమానంతో వివిధ విక్రయదారుల నుంచి మామిడి నమూనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నమూనాలను తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు.

రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్ల వల్ల పిల్లలతో సహా పౌరుల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగంచే ప్రమాదం ఉంది. విషప్రయోగం, కడుపు సంబంధిత రుగ్మతలు, ఇతర వ్యాధులను నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది. తనిఖీ నివేదిక అందిన తర్వాత సంబంధిత విక్రేతలపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.