
బక్కచిక్కిన శరీరానికి బలాన్ని ఇవ్వడానికి, వీర్య వృద్ధికి మరియు శారీరక క్షీణతను నివారించడానికి ఆయుర్వేదంలో బూడిద గుమ్మడికాయతో చేసిన లేహ్యాలను సిఫార్సు చేస్తారు. ఈ కాశీ హల్వా తయారు చేయడం చాలా సులభం, పైగా దీనికి చాలా తక్కువ దినుసులు అవసరమవుతాయి.

ముందుగా బూడిద బాగా పట్టిన తెల్ల గుమ్మడికాయను ఎంచుకోవాలి. గుమ్మడికాయ పై పొట్టు మరియు లోపలి గింజలను తీసివేసి, మీడియం సైజు రంధ్రాలు ఉన్న తురుము పీటపై తురుముకోవాలి. మరీ సన్నగా తురిమితే పేస్ట్‌లా అయిపోయి హల్వా సరిగ్గా రాదు. ఇప్పుడు ఆ తురుమును ఒక పతలాటి వస్త్రంలో వేసి గట్టిగా పిండి నీటిని వేరు చేయాలి.

ఒక పాత్రలో పిండిన గుమ్మడికాయ నీటిని పోసి, అందులోనే గుమ్మడికాయ పిప్పిని వేసి మీడియం ఫ్లేమ్‌పై 15 నుండి 20 నిమిషాలు దగ్గరపడే వరకు ఉడికించాలి. పిప్పి బాగా ఉడికిన తర్వాత, పిప్పి పరిమాణానికి సమానంగా పంచదార వేసుకోవాలి. ఉదాహరణకు 600 గ్రాముల పిప్పికి 600 గ్రాముల పంచదార.

పంచదార కరిగి మిశ్రమం గులాబ్ జామున్ పాకంలా జిగురుగా వచ్చేంత వరకు 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. పాకం పర్‌ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత అందులో 7-8 బొట్లు నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేయడం వల్ల హల్వా చల్లారిన తర్వాత పంచదార స్పటికలుగా (రవ్వగా) మారకుండా మృదువుగా ఉంటుంది.

ఆ తర్వాత కుంకుమపువ్వు, యాలకల పొడి, చిటికెడు పచ్చకర్పూరం మరియు నెయ్యి వేసి బాగా కలపాలి. వేరొక పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించి హల్వాలో కలిపి చల్లారనివ్వాలి. తడి తగలకుండా ఉంచితే ఈ కమ్మటి కాశీ హల్వా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.