
డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలన్నా లేదా ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ తాజా పండ్లు తినడం చాలా అవసరం. అయితే పండ్లలో ఉండే సహజ చక్కెరల గురించి చాలామందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ద్రాక్ష, అరటిపండ్లలో ఏది రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది..? దీనికి సంబంధించి రిజిస్టర్డ్ డైటీషియన్లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ద్రాక్ష పండ్లు: ద్రాక్ష పండ్లు పరిమాణంలో చిన్నవైనా, వాటిలో చక్కెర శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. బేరిపండ్లు లేదా అరటిపండ్లతో పోలిస్తే, ద్రాక్ష తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు కొంచెం వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇవి తినడానికి సులభంగా ఉండటంతో తెలియకుండానే ఎక్కువ పరిమాణంలో తినే ప్రమాదం ఉంది. అందుకే పరిమాణం విషయంలో జాగ్రత్త అవసరం. వీటిలో ఉండే నీటి శాతం, ఇతర పోషకాలు చక్కెర శోషణను కొంతవరకు నెమ్మదింపజేస్తాయి.

అరటిపండ్లు: అరటిపండు ప్రభావం అది ఎంతవరకు పండింది అనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కాకుండానే ప్రేగుల గుండా వెళుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు సగా పైగా ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. అరటిపండుపై నల్లటి మచ్చలు వచ్చి బాగా పండే కొద్దీ, అందులోని స్టార్చ్ సరళ చక్కెరగా మారుతుంది. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ఒక మధ్యస్థ అరటిపండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది చక్కెర రక్తంలోకి చేరే వేగాన్ని తగ్గిస్తుంది.

ఏది ఉత్తమమైన ఎంపిక?: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటిలో ఏదీ చెడ్డ పండు కాదు. మీ అవసరాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. మీరు వ్యాయామం లేదా పరుగుకు వెళ్లే ముందు ద్రాక్ష తినడం మంచిది. మధ్యాహ్న భోజనం వరకు కడుపు నిండుగా ఉండాలనుకుంటే అరటిపండు సరైన ఎంపిక.

పండ్లను విడిగా తినే కంటే వాటితో పాటు కొన్ని బాదం పప్పులు లేదా ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకుంటే చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. పండ్లను రసం రూపంలో కాకుండా నేరుగా పండులానే తినండి. దీనివల్ల మీకు అవసరమైన ఫైబర్ అందుతుంది. భోజనం లేదా పండ్లు తిన్న తర్వాత 10 నిమిషాల నడక మీ కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.