
మనం చెప్పులు లేకుండా నడిచినప్పుడు మన పాదాల అరికాళ్ళపై ఉండే ముఖ్యమైన ఆక్యుప్రెషర్ పాయింట్లు నేలను తాకడం వల్ల ఉత్తేజితమవుతాయి. ఈ పాయింట్లు శరీరంలోని ప్రధాన అవయవాలు, నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. వీటిపై పడే సహజ ఒత్తిడి మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

చెప్పులు లేకుండా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే మూత్రపిండాలు, కాలేయం వంటి అంతర్గత అవయవాల పనితీరు కూడా మెరుగవుతుంది. దీనివల్ల మొత్తం శరీరం సమతుల్యంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో సర్వసాధారణమైన నిద్ర సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు గడ్డిపై నడిస్తే శరీరానికి విశ్రాంతి లభించి, గాఢమైన నిద్ర పడుతుంది.

తడి గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం ఒక సహజ చికిత్స లాంటిది. మన శరీరంలో పేరుకుపోయిన స్థిర విద్యుత్ నేల ద్వారా విడుదలవుతుందని ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండూ చెబుతున్నాయి. అదనపు విద్యుత్ శక్తి విడుదలైనప్పుడు మనసు ప్రశాంతంగా మారి.. ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

మడమ నొప్పి, పాదాల వాపు లేదా అలసటకు చెప్పులు లేకుండా నడవడం ఒక మంచి పరిష్కారం. ఇది అరికాళ్ళపై నరాల బిందువులపై ఒత్తిడి కలిగించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో వాపు తగ్గుతుంది. పాదాల ఎముకలు, కండరాలు బలపడతాయి. కొద్దికాలం పాటు ఈ అలవాటు చేసుకుంటే మడమ నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

ఉదయం లేదా సాయంత్రం సమయంలో గడ్డిపై నడవడం ఉత్తమం. ఈ సమయంలో గాలి చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. వసంతకాలం దీనికి మరింత అనుకూలం. రోజూ కనీసం 10-15 నిమిషాలు ఇలా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.