
పాల ఉత్పత్తులతో చర్మ రోగాలు: మటన్ లేదా ఇతర మాంసాహార భోజనం ముగిసిన వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ లేదా పాయసం వంటివి అస్సలు తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. మాంసం, పాలు పరస్పర విరుద్ధమైనవి. ఇవి పొట్టలో కలిస్తే జీర్ణక్రియ పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా లాంగ్ టర్మ్‌లో సోరియాసిస్, ఎగ్జిమా వంటి తీవ్రమైన చర్మ సమస్యలకు లేదా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. జీర్ణం సులభమవ్వాలంటే మజ్జిగకు బదులు చారు తాగడం శ్రేయస్కరం.

తేనెతో వేడి : మటన్ సహజంగానే అధిక ఉష్ణ గుణం కలిగిన ఆహారం. ఇక తేనె కూడా శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తుంది. ఈ రెండింటినీ ఒకే సమయంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగిపోయి.. కడుపులో తీవ్రమైన మంట, అసిడిటీ, అల్సర్లు లేదా రక్తపోటు ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మటన్ తిన్న రోజు తేనెను పూర్తిగా పక్కన పెట్టాలి.

భోజనం తర్వాత టీ: చాలామందికి భోజనం ముగించగానే గ్లాస్ వేడి టీ తాగే చెడు అలవాటు ఉంటుంది. కానీ మటన్ తిన్న తర్వాత టీ తాగడం అత్యంత ప్రమాదకరం. టీలో ఉండే టానిన్స్ మాంసంలోని ప్రొటీన్లతో చర్య జరిపి, జీర్ణ ప్రక్రియను అడ్డుకుంటాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన అజీర్తి మరియు గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.

ఈవినింగ్ స్నాక్స్ అలవాటు మార్చుకోండి: సాయంత్రం 4 నుండి 6 గంటల సమయంలో ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్, నూనె పదార్థాల వైపు వెళ్లడం ఆరోగ్యానికి హానికరం. దానికి బదులుగా రోజువారీ అలవాటుగా ఒక అరటిపండు తినడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉండటంతో పాటు శరీరానికి తక్షణ శక్తి, పొటాషియం అందుతాయి. ఇది అనారోగ్యకరమైన స్నాకింగ్ అలవాట్లను నయం చేస్తుంది.

జీర్ణ వ్యవస్థ సురక్షితంగా ఉండాలంటే: మటన్ తిన్న తర్వాత శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలి. తిన్న వెంటనే మంచం ఎక్కేయకుండా కనీసం 15 20 నిమిషాల పాటు నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ సులువుగా పనిచేస్తుంది. అలాగే మటన్‌ను రాత్రి వేళల్లో కంటే మధ్యాహ్న భోజనంలో తీసుకోవడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో రాత్రి వేళ మటన్ తింటే, నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. కడుపు నిండా కేవలం మాంసాన్ని మాత్రమే కుక్కకుండా.. 50శాతం మాంసానికి, 25శాతం కూరగాయలు, మిగిలిన 25శాతం భాగాన్ని నీటికి, గాలికి ఖాళీగా ఉంచడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.