
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల మన జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే మంచి బాక్టీరియా జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తి పెంపు: వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. మజ్జిగలోని విటమిన్ బి-కాంప్లెక్స్, క్యాల్షియం, పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు తోడ్పడతాయి.

ఎలక్ట్రోలైట్ల సమతుల్యత: వర్షాకాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల నిరసించిపోయే ప్రమాదం ఉంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: వర్షాకాలంలో మజ్జిగను కేవలం ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత లేదా రాత్రి వేళల్లో మజ్జిగ తాగితే కఫం పెరిగి జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన లేదా ఐస్ వేసిన మజ్జిగను ఈ సీజన్‌లో అస్సలు తాగకూడదు. ఎల్లప్పుడూ రూమ్ టెంపరేచర్ వద్ద ఉండే తాజా మజ్జిగను మాత్రమే తాగాలి.

మజ్జిగ చలవ చేసే గుణాన్ని సమతుల్యం చేయడానికి అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర, నల్ల ఉప్పు లేదా చిన్న అల్లం ముక్క కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మరింత పెరుగుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండి పులిసిపోయిన మజ్జిగను వాడకూడదు. ఇది గొంతు సమస్యలకు దారితీస్తుంది. వర్షాకాలంలో వాతావరణానికి అనుగుణంగా సరైన సమయంలో, సరైన పద్ధతిలో తాజా మజ్జిగను తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.