
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల నేడు చాలామంది మధుమేహం, తీవ్రమైన జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఇసబ్‌గోల్ (Psyllium Husk) ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధంగా నిలుస్తుంది. ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండే ఈ ఇసబ్‌గోల్, నీటిని పీల్చుకుని జెల్ లాగా మారి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇసబ్ గోల్ పూర్తి ఆరోగ్య ప్రయోజనాలేంటో తప్పక తెలుసుకోవాల్సిందే..

మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనం: ఇసబ్‌గోల్‌లో కరిగే, కరుగని ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని నీటిలో లేదా పాలలో కలిపినప్పుడు అది నీటిని పీల్చుకుని జిగటగా (జెల్ లాగా) మారుతుంది. ఇది ప్రేగులలోని మలాన్ని మృదువుగా మార్చి, విసర్జన సజావుగా సాగేలా చేస్తుంది. తద్వారా మలబద్ధకం, పైల్స్ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

రక్తంలో చక్కెర (షుగర్) నియంత్రణ: మధుమేహ రోగులకు ఇసబ్‌గోల్ ఒక అద్భుతమైన పానీయం. ఇందులో ఉండే జెల్ లాంటి పదార్థం మనం తినే ఆహారంలోని గ్లూకోజ్ శరీరంలోకి నెమ్మదిగా శోషించబడేలా చేస్తుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

కొలెస్ట్రాల్, బరువు అదుపు: ఇసబ్‌గోల్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే, దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి, అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.

ఎసిడిటీ, విరేచనాల నివారణ: ఇసబ్‌గోల్ కడుపు లోపలి గోడలపై ఒక రక్షణ పొరను ఏర్పరచడం ద్వారా యాసిడ్స్ వల్ల కలిగే మంటను (ఎసిడిటీ) తగ్గిస్తుంది. విచిత్రంగా, ఇది మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా, పెరుగుతో కలిపి తీసుకుంటే విరేచనాలను (డైరియా) కూడా అదుపు చేస్తుంది.

ఎలా తీసుకోవాలి? రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో లేదా పాలలో 1-2 స్పూన్ల ఇసబ్‌గోల్ పొట్టును కలిపి వెంటనే తాగాలి. ఇలా చేయటం వల్ల మలబద్ధకం సమస్య శాశ్వతంగా దూరం చేస్తుంది. ఉదయం పూట భోజనానికి లేదా అల్పాహారానికి ముందు నీటిలో కలుపుకుని తీసుకోవటం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇసబ్‌గోల్ తీసుకున్నప్పుడు రోజంతా తగినంత నీరు (కనీసం 3-4 లీటర్లు) తప్పనిసరిగా తాగాలి. లేకపోతే ఇది పొట్టలో మరింత గట్టిపడే అవకాశం ఉంది.