
చల్లని నీరు ఉపశమనాన్ని ఇస్తే, వేడి నీరు లేదా గోరువెచ్చని నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలతో కూడిన ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రోజూ వేడి నీరు తాగితే బరువు తగ్గుతారా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అంశుమణి దాస్ ప్రకారం.. ఇది నిజమే. గోరువెచ్చని నీరు తాగినప్పుడు కడుపు నిండిన భావన కలిగి, అధికంగా ఆహారం తీసుకోకుండా నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని విషపదార్థాలను బయటకు నెట్టివేసి బరువు తగ్గడానికి మార్గం సుగమం చేస్తుంది.

ఆహారం తీసుకునే ముందు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం దాదాపు 20 శాతం వరకు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మెటబాలిజం పెరిగినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ప్రక్రియలో అదనపు క్యాలరీలు ఖర్చవుతాయి.

కేవలం బరువు తగ్గడానికే కాకుండా వేడి నీరు మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది నాడీ వ్యవస్థను కూల్ చేయడంతోపాటు పాటు కండరాల నొప్పులను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను వేగవంతం చేసి చర్మానికి సహజమైన కాంతిని అందించడంలో సహాయపడుతుంది.

డాక్టర్ అంశుమణి దాస్ తెలిపినట్లుగా.. వేడి నీరు శరీరానికి సాంత్వన, మనస్సుకు ప్రశాంతతనిచ్చే ఆరోగ్య ప్రసాదం. మన శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ సరైన సమయంలో, తగిన మోతాదులో నీటిని తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.