
ఏపీలో వర్షాలు ఉంటే, కానీ తెలంగాణలో మాత్రం చలి తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో రాత్రిపూట, తెల్లవారుజామున విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అందరూ చలికి గజగజ వణికిపోతున్నారు. రానున్న రొజుల్లో ఇంకా ఈ చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

పెద్దపల్లి పట్టణాన్ని ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు తొలగకపోవడంతో పట్టణమంతా మంచు తెరలతో కనువిందు చేసింది. ఎటుచూసినా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయపు నడకకు వచ్చిన వాకర్స్ ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని పలువురు పేర్కొన్నారు.

మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిగా వెలుతురు లేని కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకవైపు వాహనదారులకు ఇబ్బందులు కలిగించిన పొగమంచు.. మరోవైపు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ పెద్దపల్లి పట్టణానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఒక్కో మనిషికి ఇంకో మనిషి కనబడడం లేదు. ఎటు చూసినా పొగ కమ్ముకుంది. సహజంగా ఇలాంటి దృశ్యాలు ఉత్తరాది ప్రాంతాలు కనబడుతుంటాయి.

ఇక్కడ మాత్రం పూర్తిగా మంచు కప్పుకోవడం ఇదే మొదటిసారి. ఈ మంచును చూస్తూ స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ రహదారి పైన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది . ఏమాత్రం వాహనాలు కనబడలేదు. దీంతో వాహనదారులు కొద్దిసేపు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికులు మాత్రం ఈ కమ్ముకున్న పొగ దృశ్యాలను సెల్ఫోన్లో బంధించారు.