
జై షా కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను నలుగురు భారతీయులు పాలించారు. వారిలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఉన్నారు. ఇప్పుడు ఈ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడిగా జైషా నిలిచారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు జగ్మోహన్ దాల్మియా. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన దాల్మియా కంపెనీకి యజమానిగా ఉన్నప్పటికీ మొదటి నుంచి క్రికెట్ ఆటపై ఆసక్తి ఉన్న దాల్మియా 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

NCP అధినేత శరద్ పవార్ అత్యంత ప్రభావవంతమైన భారతీయ రాజకీయ నాయకులలో ఒకరు. రాజకీయాల్లోనే కాదు క్రికెట్‌లోనూ శాసించాడు. అతను 2010 నుంచి 2012 వరకు రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా ఉన్నాడు. దీంతో భారత్ నుంచి ఐసీసీ అధ్యక్షుడైన రెండో వ్యక్తిగా నిలిచాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాజీ ఛైర్మన్‌లలో ఎన్ శ్రీనివాసన్ కూడా ఒకరు. ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మూడో భారతీయుడు. 2014-2015 మధ్య ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారు. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకముందే పదవి నుంచి దిగిపోయాడు. వ్యాపారవేత్త ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అవినీతి, స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో ఆయన పేరు వినిపించింది. దీంతో అతడు బీసీసీఐ పదవికి దూరమయ్యాడు.

జూన్ 2014లో ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఎన్ శ్రీనివాసన్ రెండేళ్ల పదవీకాలం పూర్తికాకముందే వైదొలగడంతో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడయ్యారు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ 2016లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఐసీసీలో కొనసాగుతున్నాడు. ICC మొదటి స్వతంత్ర మహిళా డైరెక్టర్ ఎంపిక అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌లో మార్పును తీసుకువచ్చింది. క్రీడ అభివృద్ధికి మార్గం సుగమం చేసింది.

ఇప్పుడు భారత్ నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా మరోసారి జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబరు 1 నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా జైషా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. భారత్ నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 5వ వ్యక్తి జైషా.