
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ సారధ్యంలో యువ ప్లేయర్స్ అందరూ కూడా కట్టుదిట్టమైన ఆటతీరును కనబరిచి.. 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్నారు. ఓపెనింగ్‌లో జైస్వాల్.. మిడిలార్డర్‌లో గిల్, సర్ఫరాజ్.. లోయర్ ఆర్డర్‌లో ధృవ్ జురెల్.. అలాగే బౌలింగ్‌లో ఆకాష్ దీప్.. ఇలా కుర్రాళ్ళంతా రఫ్ఫాడించారు. మరి ఈ టీమిండియా విజయంలో కీలకమైన 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బౌలింగ్: మొదటి టెస్ట్ తప్పితే.. మిగిలిన మూడు టెస్టుల్లోనూ మన టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. అరంగేట్ర బౌలర్ ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బూమ్రాతో పాటు స్పిన్ మాయాజాలంతో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ప్రత్యర్ధి టీంను ఈజీగా మడతపెట్టేశారు. ప్రత్యర్ధి జట్టుకు ధారాళంగా పరుగులు ఇవ్వకుండా.. తక్కువ స్కోర్‌కే పెవిలియన్ పంపడంలో విజయం సాధించారు. మన టీమిండియా గెలుపులో బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

యశస్వి జైస్వాల్: ఈ సిరీస్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 8 ఇన్నింగ్స్‌లలో 655 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో అతడు రెండు భారీ శతకాలు, రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. నాలుగో టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేశాడు జైస్వాల్. పెద్దగా అనుభవం లేకపోయినా.. ఇంగ్లీష్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కున్నాడు.

ధృవ్ జురెల్: ఆడింది కేవలం ఒక్క టెస్టే.. కానీ ఆటతీరు మాత్రం అమోఘం. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు.. 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో కూడా గిల్‌తో కలిసి కీలకమైన 39 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్‌లో అతడు చూపించిన టెంప్రమెంట్, ధోని లాంటి కామ్‌నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

రోహిత్ శర్మ: టెస్టుల్లో రోహిత్ పనికిరాడు.. అన్నవారి నోరుమూయించాడు హిట్‌మ్యాన్. సీనియర్లు లేకపోయినా.. జూనియర్లతో బరిలోకి దిగి.. ఇంగ్లాండ్ బౌలర్లను ముచ్చెమటలు పట్టించాడు. జట్టుకు అవసరమైనప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా.. బౌలర్లతో మధ్య మధ్యలో ముచ్చటిస్తూ.. రివ్యూల విషయంలో అండగా ఉంటూ.. టీంకు వెన్నుముకలా నిలిచాడు రోహిత్ శర్మ.

రవిచంద్రన్ అశ్విన్: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్ పట్టుబిగిస్తోందనుకున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసి ఇంగ్లీషోళ్ల వెన్ను విరిచాడు. డకెట్, పోప్, రూట్, ఫోక్స్ లాంటి కీలక బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. భారత్ విక్టరీలో అశ్విన్ పాత్ర చాలా కీలకం. అలాగే బ్యాట్‌తో నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేసిన గిల్కూడా టీమిండియా విజయానికి ఓ కారణం.