
శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బౌలర్లు చేసిన పలు తప్పిదాల వల్ల టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ నో బాల్స్ వేసి అవాంఛిత ప్రపంచ రికార్డు సృష్టించి జట్టు ఓటమికి కారణమయ్యాడు. నో బాల్ విసరడం క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద నేరంగా పరిగణిస్తుంటారు. అయితే టీ20 క్రికెట్‌లో ఒక్క నోబాల్ కూడా వేయని టీమిండియా బౌలర్ కూడా ఉన్నాడని మీకు తెలుసా?

ఆ బౌలర్ ఎవరో కాదు.. అనుభవజ్ఞుడైన భారత ఆటగాడు భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క నోబాల్ కూడా వేయలేదు.

2012 డిసెంబర్ 15న బెంగుళూరులో పాకిస్థాన్‌తో తన మొదటి T20 మ్యాచ్ ఆడిన భువనేశ్వర్.. అప్పటి నుంచి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మొత్తం 298.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కానీ, ఇందులో ఒక్క నోబాల్ కూడా వేయలేదు.

గతేడాది నవంబరు 22న నేపియర్‌లో న్యూజిలాండ్‌తో చివరి టీ20 మ్యాచ్ ఆడిన భువనేశ్వర్‌కు ప్రస్తుత శ్రీలంకతో సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు.

భువనేశ్వర్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే, భువీ ఇప్పటివరకు 87 టీ20 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. అలాగే 6.96 ఎకానమీతో పరుగులు ఇచ్చిన భువీ.. 23.10 సగటుతో వికెట్లు తీశాడు.