Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీకి ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిన్ననే లంక జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడినట్లు సమాచారం.
నివేదిక ప్రకారం.. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర, స్పిన్నర్ వనిందు హసరంగా గాయపడిన సంగతి తెలిసిందే. దుష్మంత చమీర టోర్నీ నుంచి తప్పుకోవడంతో పాటు హసరంగ ఓపెనింగ్ మ్యాచ్‌లకు అందుబాటులో లేడని సమాచారం అందుతోంది.
ESPNCricinfo నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో జరిగే గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లకు హస్రంగ అందుబాటులో ఉండరని శ్రీలంక జట్టు మేనేజర్ మహింద హలంగోడ ప్రకటన విడుదల చేశాడు. భుజం నొప్పితో బాధపడుతున్న చమీరా మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ టోర్నీలో హసరంగ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే, అతని నాయకత్వంలో బి-లవ్ క్యాండీ ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తం లీగ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది.
లంక ప్రీమియర్ లీగ్ సమయంలో గాయపడిన చమీర్ జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో ఆరు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకపోవడం లంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
ఇంతలో, లంక జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్ పెరీరా, ఫెర్నాండో ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఈ ఇద్దరూ ఆసియా కప్ ప్రారంభానికి ముందే కోలుకునే అవకాశం ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు వీరిద్దరికీ మరోసారి పరీక్ష జరగనుంది. వీరిద్దరి రిపోర్టు నెగిటివ్‌గా వస్తే ఈ ఇద్దరినీ టీమ్‌లో ఆడించనున్నట్లు సమాచారం.