
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. . ఆయన సతీమణి రుబాబ్ ఖాన్ శుక్రవారం (మార్చి1) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్తర్ దంపతులకు ఇది మూడో సంతానం. ఇప్పటికే మహమ్మద్ మికైల్ అలీ, మహమ్మద్ ముజద్దీద్ అలీ అనే ఇద్దరు కుమారులున్నారు.

2014లో షోయబ్ అక్తర్, రుబాబ్‌లు పెళ్లిపీటలెక్కారు. అయితే వివాహం చేసుకునే సమయానికి అక్తర్ వయసు 38 ఏళ్లు కాగా.. రుబాబ్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే.

తనకంటే 18 ఏళ్ల చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో అక్తర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీరి వివాహ బంధానికి ప్రతీకగా 2016లో పెద్ద కొడుకు మహ్మద్ మికైల్ అలీ పుట్టగా, 2019లో చిన్న కుమారుడు ముజద్దీద్ అలీ జన్మించాడు.

ఇప్పుడు మూడో సంతానంగా శుక్రవారం అమ్మాయి పుట్టింది. షోయబ్ అక్తర్ దంపతులు ఆ చిన్నారికి నూరే అలీ అక్తర్ అనే నామకరణం చేశారు

ఈ విషయాన్ని అక్తరే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ అల్లా మాకు పండంటి ఆడబిడ్డను ప్రసాదించారు. మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ పోస్ట్ చేశాడు. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు అక్తర్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.