నవంబర్ 5 భారత క్రికెట్‌కు చాలా ప్రత్యేకమైన రోజు. గత దశాబ్ద కాలంగా కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడుగా మారిన విరాట్ కోహ్లీకి కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ శతాబ్దపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. నవంబర్ 5, 1988లో జన్మించిన విరాట్ కోహ్లి.. ఢిల్లీ వీధుల్లోంచి వచ్చిన విరాట్ కోహ్లి గత దశాబ్ద కాలంలో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తూ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ గొప్ప బ్యాట్స్‌మెన్ ప్రతీ కథ, రికార్డ్ గురించి అతని అభిమానులకు తెలుసుకోవడం సహజం. అయితే కోహ్లీ 33 వ పుట్టినరోజున కొన్ని ప్రత్యేక రికార్డుల గురించి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
2008లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 8000, 9000, 10000, 11000, 12000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కోహ్లి కేవలం 175 ఇన్నింగ్స్‌లలో 8000 పరుగులు పూర్తి చేయగా, కేవలం 242 ఇన్నింగ్స్‌లలో (సచిన్ 300 ఇన్నింగ్స్‌లు) 12000 పరుగులు పూర్తి చేశాడు.
వేగంగా పరుగులు చేయడం మాత్రమే కాదు, ఇందులో సెంచరీల గురించి చర్చించడం కూడా ఎంతో ముఖ్యం. అంతెందుకు కోహ్లీకి రన్ మెషిన్, సెంచరీ మెషిన్ అనే పేరు కూడా వచ్చిందంటేనే తెలుసుకోవచ్చు. కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 70 సెంచరీలు సాధించాడు. ఇందులో అతను కెప్టెన్‌గా 41 సెంచరీలు సాధించాడు. ఇదో ప్రపంచ రికార్డుగా నిలిచింది.
శతాబ్దాలుగా ఓ చర్చ కొనసాగుతోంది. కోహ్లి సాధించిన 43 వన్డే సెంచరీలలో 35 భారత జట్టు గెలిచినవే కావడం ప్రపంచ రికార్డుగా నిలిచింది. ఇందులో 2013లో ఆస్ట్రేలియాపై ఒక సెంచరీ కూడా వచ్చింది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది భారతదేశం తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డయింది.
సెంచరీల కథలు ఎక్కువే.. కానీ, ప్రస్తుతం డబుల్ సెంచరీల కాలం నడుస్తోంది. కోహ్లి ఇప్పటి వరకు వన్డేల్లో డబుల్ సెంచరీ చేయకపోయినా టెస్టుల్లో మాత్రం డబుల్ సెంచరీ సాధించాడు. తన 96 టెస్ట్ కెరీర్‌లో, కోహ్లి 7 డబుల్ సెంచరీలు సాధించాడు. ఇది ఏ భారతీయ బ్యాట్స్‌మెన్‌తో పోల్చినా అత్యధికంగా నిలివడం విశేషం. కెప్టెన్‌గా కోహ్లి ఏడు డబుల్ సెంచరీలు సాధించి, అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్‌గాను నిలిచాడు.
ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే.. కోహ్లీ కెప్టెన్సీలో ఎలాంటి ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోలేదు. అయితే కెప్టెన్‌గా అతని అంతర్జాతీయ రికార్డు చాలా బాగుంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధికంగా 65 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి, 38 టెస్టుల్లో విజయం సాధించాడు. ఐసీసీ టైటిల్ గెలవకపోవడం కోహ్లీ కెరీర్‌లో ఓ మచ్చగా తయారైంది.
ప్రపంచ టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతను కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 3225 పరుగులు చేశాడు. దీంతో పాటు 29 హాఫ్ సెంచరీలు కూడా నమోదయ్యాయి. మూడు ఫార్మాట్లలో 50 కంటే ఎక్కువ సగటు ఉన్న ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. టీ20లో 52.01, వన్డేలో 59.07, టెస్టులో 51.08గా ఉంది.
కోహ్లీ 2008లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 70 సెంచరీలు, అలాగే అత్యధికంగా 23,519 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో అత్యధికంగా 12,169 పరుగులు చేశాడు. 43 సెంచరీలు అతని సొంత బ్యాట్ నుంచే వచ్చాయి. మొత్తంమీద, తన కెరీర్‌లో, కోహ్లీ ఇప్పటివరకు 96 టెస్టుల్లో 162 ఇన్నింగ్స్‌లలో 51.08 సగటుతో 27 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో 7765 పరుగులు చేశాడు. వన్డేల్లో, కోహ్లి 245 ఇన్నింగ్స్‌లలో 254 మ్యాచ్‌లలో 59.07 సగటుతో 43 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలతో 12,169 పరుగులు చేశాడు. అదేవిధంగా 86 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో 3225 పరుగులు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు.