
ప్రస్తుతం స్వదేశంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉండగా.. మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి కొనసాగుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడొక ఓ టీమిండియా క్రికెటర్.. ఇంగ్లీష్ జట్టులో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతడెవరో కాదు కరుణ్ నాయర్.

భారత కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ ఏప్రిల్-మే నెలల్లో నార్తాంప్టన్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఈ రెండు నెలలు నార్తాంప్టన్‌షైర్ తరపున ఏడు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడతాడు. గత ఏడాది కూడా ఈ కౌంటీ జట్టుకు నాయర్ మూడు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా మ్యాచ్‌ల్లో 78, 150, 21 పరుగులు చేశాడు. ఆ సమయంలో పృథ్వీ షా స్థానం.. నాయర్ జట్టులోకి వచ్చాడు.

గత సీజన్‌లో నాయర్ ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో నాయర్ అద్భుతంగా రాణించాడు. అతడి ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్ ప్రవర్తన మిగతా సభ్యులందరిపై ఓ చెరగని ముద్ర వేసింది. నాయర్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు నార్తాంప్టన్‌షైర్ కౌంటీ కోచ్ జాన్ సాడ్లర్.

దాదాపు ఏడేళ్ల నుంచి కరుణ్ నాయర్ టీమిండియాకు దూరంగా ఉన్నాడు. మార్చి 2017లో నాయర్ భారత్ తరపున చివరిసారిగా ఆడాడు. ఆరు టెస్టులు, రెండు వన్డేలలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు కరుణ్ నాయర్. ప్రస్తుతం టీమ్ ఇండియాలో పునరాగమనం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ గట్టిపోటీ ఉండటంతో అది సాధ్యం కావట్లేదు. అలాగే ఈ ఐపీఎల్ 2024 మినీ వేలంలోనూ కరుణ్ నాయర్ అన్‌సోల్డ్ లిస్టులో మిగిలిపోయాడు.

భారత్ తరపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్ నాయర్. చెన్నైలో ఇంగ్లాండ్‌పై నాయర్ ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్ 2016లో ఈ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో నాయర్ అజేయంగా 303 పరుగులు చేశాడు. అలాగే అతడి కెరీర్‌లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం.