
World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో 2019 వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజిలాండ్.. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఇంగ్లాండ్‌లో తలపడనుంది.

అయితే ప్రారంభ మ్యాచ్‌కి ఇంకా రెండు నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వన్డే వరల్డ్‌కప్ గురించి మాట్లాడాడు.

అంతేకాక రానున్న వరల్డ్‌కప్‌లో నవంబర్ 15, 16న జరిగే తొలి, రెండో సెమీఫైనల్‌కి చేరుకునే నాలుగు ఉత్తమ జట్లు ఏమిటో కూడా చెప్పేశాడు.

2023 వన్డే వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం అందిస్తున్న భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కి చేరుకునే అవకాశం ఉందని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు. సొంతం దేశంలో జరిగే టోర్నీలో భారత్ అందరి ఫేవరెట్ అని.. ఆస్ట్రేలియా జట్టుని ఎంచుకోవడంలో ఎలాంటి సందేహం లేదని.. ఇంగ్లాండ్, పాకిస్తాన్ కూడా బాగానే ఆడుతున్నాయని ఈ దిగ్గజం చెప్పుకొచ్చాడు.

విశేషమేమిటంటే.. మెక్ గ్రాత్ ఎంచుకున్న నాలుగు జట్లలోని.. భారత్, పాక్ ఎప్పటినుంచో చిరకాల ప్రత్యర్థులన్న సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ విషయానికి వస్తే.. ఈ రెండు జట్లు అంతర్జాతీయ క్రికెట్ తొలినాళ్ల నుంచే చిరకాల ప్రత్యర్థులు.

కాగా, భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో.. ఆక్టోబర్ 14న పాకిస్తాన్‌తో.. అక్టోబర్ 29న ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అయితే భారత్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఇప్పటికీ గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న నేపథ్యంలో మెగా టోర్నీ సమయానికి కోలుకుని పునరాగమనం చేస్తారా లేదా అనేదానిపై ఇంకా సందిగ్ధ పరిస్థితి ఉంది.