
ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, అతని కుటుంబం తీవ్ర శోక సంద్రంలో ఉన్నారు.. కమ్మిన్స్ తల్లి మార్చి 10న కన్నుమూసింది. ఈ సందర్భంగా తనను లాలించిన తల్లి మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు కమిన్స్. ఈ సందర్భంగా తల్లితో తనకున్న మధురు క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడీ స్టార్ ఆల్‌రౌండర్.

ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో తల్లితో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు కమిన్స్. 'నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అమ్మా.. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు' అని అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు.

కమిన్స్ తల్లి మారియా చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడింది. గత నెలలో ఆమె ఆరోగ్యం బాగా విషమించింది. ఆ సమయంలో కమిన్స్ భారత్‌లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన తర్వాత బాగా కుంగిపోయాడు కమిన్స్.

ఢిల్లీ టెస్టు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ కోసం ఇండోర్ వెళ్లాల్సి వచ్చింది. అయితే కమిన్స్ జట్టుతో అక్కడికి వెళ్లలేదు. తన తల్లితో ఉండటానికి ఢిల్లీ నుండి వెంటనే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కమిన్స్ నిర్ణయానికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మద్దతు తెలిపింది.

పాట్ కమిన్స్ తల్లి మరణానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అందించింది. క్రికెట్ ఆస్ట్రేలియా తన విడుదల చేసిన ప్రకటనలో ' మరియా కమిన్స్ మరణంతో మేము చాలా బాధపడ్డాం. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున, మేము పాట్, కమిన్స్ కుటుంబ సభ్యులు, వారి స్నేహితులకు మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం' అని సంతాప సందేశం పంపింది. ఆమె గౌరవార్థం ఆస్ట్రేలియా జట్టు నల్ల బ్యాడ్జీలు ధరించి క్రికెట్ ఆడింది.