- Telugu News Photo Gallery Cricket photos 5 Reasons Why India Lost Test Series To New Zealand In Pune, Details Here
IND Vs NZ: టీమిండియాకు అసలేమైంది.? 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఓటమికి కారణాలివే
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా చేజార్చుకుంది. పూణేలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ పేలవ బ్యాటింగ్, పిచ్‌పై అవగాహన లేమి, పేలవమైన కెప్టెన్సీ, ఫాస్ట్ బౌలర్ల నిరాశాజనక ప్రదర్శన ఓటమికి కారణాలయ్యాయి. రిషబ్ పంత్ రనౌట్ కూడా..
Updated on: Oct 26, 2024 | 6:25 PM

మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి.. సిరీస్ కైవసం చేసుకుంది న్యూజిలాండ్. సొంతగడ్డపై 12 ఏళ్ల తర్వాత భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయింది. మొత్తానికి పూణే టెస్టులో భారత్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే..

పూణే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ పేలవంగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌట్ కావడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 1 పరుగు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు.

పూణే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సులువుగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శాంట్నర్‌ను ఎదుర్కోవడంలో టీమిండియా ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. శాంట్నర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో 6 వికెట్లు తీశాడు.

రోహిత్ శర్మ ఎప్పుడూ ఎటాకింగ్ ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. కానీ పూణే టెస్టులో పూర్తిగా డిఫెన్స్ గేమ్‌పై దృష్టి పెట్టాడు. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయిన సమయంలోనూ రోహిత్ శర్మ దూకుడుగా ఫీల్డింగ్ చేయలేదు. దీన్ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేదు. స్పిన్నర్లకు ఫాస్ట్ బౌలర్ల నుంచి సహకారం లేకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమైంది.

359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. కానీ మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ముఖ్యంగా ఇండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ రిషబ్ పంత్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ భారత్‌ని భారీగా దెబ్బేసింది.



















