
వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణవ్యవస్థ చాలా మందగిస్తుంది. దీనికి తోడు ఈ సీజన్‌లో వేడివేడి బజ్జీలు, పకోడీలు లేదా సమోసాలు వంటి జిడ్డు పదార్థాలు తినడానికి చాలామంది మొగ్గు చూపుతారు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం, వికారం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడే సోంపు గింజలు ఒక కడుపును రిలీఫ్‌నిచ్చేలా అద్భుతంగా పనిచేస్తాయి. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ ప్రకారం.. సోంపులో ఉండే అనెథోల్ అనే సుగంధ సమ్మేళనం జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి, హానికరమైన మెటబాలిక్ వేడిని పుట్టించకుండా జీర్ణ ఎంజైములను స్రవిస్తుంది. ఇది పొట్టలోని ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి, తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

మరోవైపు వర్షాకాలంలో వచ్చే విపరీతమైన ఉక్కపోత వల్ల శరీరంలో అంతర్గత వేడి పెరిగిపోతుంది. దీనివల్ల చర్మంపై రాషెస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, మొటిమలు, మూత్రంలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో ధనియాల నీరు ఒక అద్భుతమైన అంతర్గత క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. పరిశోధనల ప్రకారం.. ధనియాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సహజసిద్ధమైన డైయూరిటిక్‌గా పనిచేస్తాయి. ఇవి కిడ్నీలను ప్రేరేపించి శరీరంలోని హానికరమైన టాక్సిన్లను, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపి శరీరాన్ని లోపలి నుండి పూర్తిగా శుభ్రపరుస్తాయి.

ఈ వర్షాల సీజన్‌లో వైరల్ జ్వరాలు, సీజనల్ ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ పరిశోధనల ప్రకారం.. ధనియాలలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ లోడ్ కణాల పొరలను బలోపేతం చేస్తుంది. ఇది వాతావరణంలో వచ్చే బ్యాక్టీరియల్, వైరల్ దాడుల నుండి శరీర కణాలను రక్షిస్తుంది. అదేవిధంగా సోంపులో ఉండే జింక్, సెలీనియం, క్యాల్షియం వంటి కీలక ఖనిజాలు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నిరోధానికి, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి ఎంతో దోహదపడతాయి.

ఈ సీజన్‌లో ధనియాలు, సోంపు రెండూ విభిన్న మార్గాల్లో శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాల వల్ల వచ్చే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, గ్యాస్‌కు సోంపు తక్షణ ఉపశమనాన్ని ఇస్తే, అధిక ఉక్కపోత వల్ల వచ్చే చర్మ అలర్జీలు, విషపదార్థాలు, అంతర్గత వేడికి ధనియాల నీరు ఉత్తమమైనదిగా నిలుస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో ఈ రెండింటిలో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవడం కంటే, రెండింటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ హెల్త్ డ్రింక్ లాగా తీసుకోవడం వల్ల వర్షాకాలంలో రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు.

ఈ రెండింటి నుండి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి.. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను కాస్త కచ్చాపచ్చాగా దంచి, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే ఈ నీటిని వడగట్టి, కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసి ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది. రోజంతా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ దొరుకుతుంది.