
వంట చేసేటప్పుడు బాణలిలో నూనె బాగా వేడెక్కే వరకు వేచి ఉంటున్నారా? కొన్నిసార్లు నూనె మరింతగా వేడెక్కి పొగలు కూడా రావడం గమనించే ఉంటారు. ఇలాంటి నూనె వినియోగించడం ఆరోగ్యానికి అంత మంచిందికాదట. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రమాదాన్ని నివారించడానికి బాణలిలో నూనె పొగ వచ్చిన వెంటనే గ్యాస్ మంటను ఆపివేయాలి.

నూనెలో సంతృప్త కొవ్వు, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంటాయన్న సంగతి తెలిసిందే. నూనెను పదేపదే వేడిచేయడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఒకసారి వినియోగించిన నూనెను తర్వాత ఉపయోగించడం వల్ల వాటిల్లోని పోషకాలు విష పదార్ధాలుగా మారే అవకాశం ఉంది.

చాలా మందికి నూనెను పదే పదే వేడి చేసే అలవాటు ఉంటుంది. ఒకే బాణలిలో పదే పదే వేయించడం వల్ల తినే ఆహారంలో పోషక విలువలు తగ్గుతాయి.

ఒకసారి ఉపయోగించిన నూనె చల్లబడిన తర్వాత ఫిల్టర్ చేసి, గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె శరీరానికి హాని కలిగించదు. మీరు ఈ నూనెను మళ్లీ వంట కోసం ఉపయోగించవచ్చు.

అయితే ఇలాంటి నూనెను వినియోగించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. సాధ్యమైనంత వరకూ ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వినియోగించకపోవడం మంచిది.