
తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉంది.. నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలున్నారు.. అడక్కుండానే కారెక్టర్స్ రాసే దర్శకులున్నారు.. కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్‌పైనే ఉన్నాయి. నార్త్ అంతా మన జపం చేస్తుంటే.. హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాట పడుతున్నారు. కీర్తి సురేష్, సమంత, రష్మిక ఇలా అంతా ఇప్పుడు బాలీవుడ్డే అంటున్నారు.

బాలీవుడ్ అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్లు కానీ ఇప్పుడంత సినిమా లేదు.. సీన్ అంతకంటే లేదు. వాళ్లే మనల్ని చూసి వావ్ అంటున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ హిందీ వైపు అడుగులేస్తున్నారు. దీనికి ఒకే కారణం ఉంది. అదే రెమ్యునరేషన్..! అవును.. మన కంటే బాలీవుడ్‌లో డబుల్ పారితోషికం అందుకుంటున్నారు హీరోయిన్లు.

రష్మిక మందన్ననే తీసుకోండి.. మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసినా 2 కోట్లకు మించదు రెమ్యునరేషన్. అదే బాలీవుడ్‌లో ఒక్క ప్రాజెక్ట్ సైన్ చేస్తే 10 కోట్ల వరకు పారితోషికం వస్తుందని తెలుస్తుంది. పైగా నేషనల్ వైడ్ క్రేజ్ ఫ్రీ. కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ కోసం భారీగానే తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఫ్లాపైనా.. అమ్మడికి ఆఫర్స్ అయితే బానే వస్తున్నాయి.

సౌత్‌లో 2 కోట్లకు మించని కీర్తి రెమ్యునరేషన్.. బాలీవుడ్‌లో మాత్రం డబుల్ అయింది. సమంత కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే.. నార్త్‌లో చేసే వెబ్ సిరీస్‌లతోనే ఎక్కువ సంపాదిస్తున్నారు.

వీళ్ళే కాదు.. రెజీనా, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లు సైతం బాలీవుడ్‌లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అన్నట్లు సన్నీ డియోల్ జాట్‌లో రెజీనానే హీరోయిన్.