బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్ రూమర్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ వార్తలపై వీరిరువురూ స్పందించలేదు. ఇటీవల కొన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి రావడం రూమర్స్‌కు మరింత బలం చేకూర్చినట్లైంది.
గత నెలలో ముంబైలో లంచ్ డేట్‌లో కలిసి కనిపించిన తర్వాత ఈ జంట ప్రేమాయణంపై వార్తలు వండి వార్చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. తాజాగా ఈ జంటకు సంబంధించిన క్రేజీ న్యూస్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఢిల్లీ వేదికగా ఈ ప్రేమజంట ఈ నెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు సమాచారం. వీరి పెళ్లి అక్టోబర్‌లో జరిగే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తిరంగా సహనటుడు హార్డీ సంధు ఈ పుకార్లను బలపరిచేలా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ.. 'పరిణీతికి కాల్ చేసి అభినందనలు తెలిపాను. చివరికి ఇది జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని' చెప్పుకొచ్చాడు. మార్చి 28న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా కూడా సోషల్ మీడియా వేదికగా పరిణీతి, రాఘవ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు కూడా.
ఇక దీనిపై పరిణీతి-రాఘవ్ చద్దా అధికారికంగా ధృవీకరించనప్పటికీ వీరి పెళ్లి వార్తలు మాత్రం నానాటికి ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం పరిణీతి చోప్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయాల్లో బిజీగా ఉన్నందువల్ల పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.