ఇండియా భారత్ గా మారనుందా? కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తుందా? సోషల్ మీడియాలోనూ.. మీడియా ఛానెల్లలోనూ.. ఎక్కడ చూసినా ఇప్పుడంతా దీనిపైనే చర్చ కొనసాగుతోంది. చాలామంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇండియా పేరును భారత్‌గా మార్చే విషయంలో పలువురు స్టార్ సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్, కంగనా రనౌత్.. ఇలా సెలబ్రిటీలందరూ ఇండియా పేరును భారత్‌గా మార్చాలంటూ పోస్టులు పెడుతున్నారు.
బుధవారం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయగా.. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 'ప్రపంచకప్‌లో మనం టీమిండియా క్రికెటర్ల జెర్సీలపై భారత్ ముద్రించాలి. ఈ మేరకు బీసీసీఐ చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ పెట్టారు.
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్. ఇన్నాళ్లు ఇండియా పేరు మీకు గర్వంగా అనిపించలేదా? అంటూ ట్వీట్ చేశారు. అలాగే అసలు ఈ పేరు మార్పు దేనికి? అంటూ ప్రశ్నలేవనెత్తాడు.
షూటింగ్ లొకేషన్‌లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విశాల్ ' అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థికాభివృద్ధికి ఇది ఏ మేరకు యూజ్ అవుతుంది? ఈ మధ్యకాలంలో నేను చూసిన వింత వార్త ఇదే. ఇండియా, భారత్.. ఇలా రెండు పేర్లతో పిల్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఉన్నట్లుండి ఇండియా పదాన్ని ఎందుకు వదిలించుకుంటున్నారో అర్థం కావడం లేదు' అని రాసుకొచ్చాడు విశాల్.