ఇప్పటికే తన గాత్రంతో చాలా సార్లు అభిమానులను అలరించిన పవన్, హరి హర వీరమల్లు సినిమా కోసం మరోసారి గొంతు సవరించుకున్నారు. మాట వినాలి అనే పాటను స్వయంగా ఆలపించారు. పవన్‌కు ఎంతో నచ్చిన జానపద బాణీ కావటంతో స్వయంగా తానే పాడాలని నిర్ణయించుకున్నారు పవర్ స్టార్.
కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు పెంచల్ దాస్ సాహిత్యమందించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పవన్ వాయిస్‌లోనే ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అన్ని భాషల్లో పవన్ స్వయంగా పాడకపోయినా.. ఏఐ సాయంతో పవన్ గొంతుకు దగ్గరగా ఉండేలా వాయిస్‌లో మార్పులు చేశారు.
ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న హరి హర వీరమల్లు, మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది చిత్రయూనిట్. అందుకే క్రిష్ అందుబాటులో లేకపోవటంతో జ్యోతికృష్ణ సినిమాను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు.
తొలిసారి పవన్ పీరియాడిక్ మూవీ చేస్తుండటంతో హరి హర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తోంది మెగా సూర్య ప్రొడక్షన్స్.