
మలయాళ నటి పార్వతి తిరువోతు మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ నటి.. నిజ జీవితంలోనూ తన ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహిళల హక్కులు, చిత్ర పరిశ్రమలో వివక్ష వంటి అంశాలపై ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తుంటారు. అయితే గతంలో ఓ సినిమా విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె ఎంతటి వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందో తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నారు.

తనను ఇండస్ట్రీలోని కొంతమంది కావాలనే ఒంటరిని చేశారని, ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని వెల్లడించారు. ఇంతకీ పార్వతి చేసిన వ్యాఖ్యలేంటి? అప్పట్లో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? 2016లో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం 'కసాబా' విడుదలైంది. ఈ సినిమాలో మహిళలను కించపరిచేలా ఉన్న కొన్ని సంభాషణలు, సన్నివేశాలపై పార్వతి తిరువోతు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2017లో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFK) సందర్భంగా జరిగిన చర్చలో ఆమె తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు.

మమ్ముట్టి వంటి గొప్ప నటుడు మహిళలను అవమానించే విధంగా ఉన్న సన్నివేశాల్లో నటించడం తనను నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పార్వతి వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు హద్దులు దాటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు అత్యాచారం, హత్య బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ వేధింపులపై పార్వతి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ఒక సినిమాలోని సన్నివేశంపై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఓ నటికి ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా రంజిని హరిదాస్ నిర్వహిస్తున్న 'ది గ్రీన్ రూమ్' సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న పార్వతి.. అప్పటి చేదు అనుభవాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆ వివాదం సమయంలో తనకు సన్నిహితంగా ఉన్న చాలామంది కూడా దూరంగా జరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను పూర్తిగా ఒంటరిగా మారిపోయానని తెలిపారు.

"నాపై వచ్చిన ద్వేషం కేవలం నా ఒక్కరిపైనే కాదు. సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పితృస్వామ్య భావజాలం, స్త్రీ ద్వేషం బయటపడటానికి నేను ఒక మాధ్యమంగా మారాను. ఆ సమయంలో నన్ను కొంతమంది దూరం పెట్టారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి నా ఆరోగ్యం, మానసిక స్థైర్యంపై దృష్టి పెట్టాను" అని పార్వతి వెల్లడించారు.