
ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు.. మార్కెట్‌లో ఏం నడుస్తుందో చూసి అలాంటి సినిమాలు తీసుకుంటూ పోతే మంచిది అంటున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇప్పుడు దెయ్యాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వరసగా అలాంటి కథలే సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది భూల్ భులయ్యా 3, స్త్రీ 2 లాంటి సినిమాలు రొటీన్ కథలతో వచ్చి కనక వర్షం కురిపించాయి.

ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ముంజ్యా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో స్త్రీ 2, ముంజ్యా ఒకే బ్యానర్ నుంచి వచ్చాయి. అదే మ్యాడాక్ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఒకేసారి 8 హారర్ సినిమాలను రిలీజ్ డేట్స్‌తో సహా ప్రకటించింది. 2028 వరకు వీళ్ళ సంస్థ నుంచి కావాల్సినన్ని ఆత్మ కథలు రానున్నాయి.

ఈ ఏడాది తమతో వీళ్ళ దెయ్యాల దండయాత్ర మొదలు కానుంది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. ఈ సినిమాను దివాళికి విడుదల చేయనున్నారు.

ఇక డిసెంబర్‌లో శక్తి షాలిని రానుంది. ఇందులో అలియా భట్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి. 2026లో వరుణ్ ధావన్ భేడియా 2 రానుంది. 2022లో భేడియా ఇదే సంస్థ నుంచి వచ్చింది.

2026లోనే చాముండా సినిమా రానుంది. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించే అవకాశముంది. 2027లో స్త్రీ 3, మహా ముంజ్యా సిద్ధమవుతున్నాయి. ఈ రెండూ స్త్రీ, ముంజ్యా ఫ్రాంచైజీలో రాబోయే సినిమాలు. 2028లో పెహ్లా మహాయుద్ధ్, దూస్రా మహాయుధ్ వస్తాయి. మొత్తానికి మ్యాడాక్ అంతా ఇప్పుడు దెయ్యాల కోటగా మారిపోయింది.