
రసాయన మార్పు - టాక్సిన్స్ ఉత్పత్తి: బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, వాటిలో పోషక విలువలు తగ్గిపోయి..సోలనిన్ (Solanine), చాకోనిన్ (Chaconine) అనే రెండు గ్లైకోఅల్కలాయిడ్ సమ్మేళనాల సాంద్రత అత్యంత వేగంగా పెరుగుతుంది. ఇవి వాస్తవానికి బంగాళాదుంప మొక్క తనను తాను కీటకాల నుండి రక్షించుకోవడానికి తయారుచేసుకునే సహజ రసాయన విషాలు.

శరీరంపై చూపే భయంకరమైన ప్రభావాలు: సైన్స్ డైరెక్ట్ పరిశోధనల ప్రకారం, ఈ విష పదార్థాలు శరీరంలోకి చేరిన కొన్ని గంటల్లోనే తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఇవి కడుపు లైనింగ్‌ను దెబ్బతీసి తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులకు దారితీస్తాయి.

మొలకెత్తిన దుంపలను వాడటం ఎలా?: ఒకవేళ బంగాళాదుంపలు కొద్దిగా మాత్రమే ఆకుపచ్చగా మారి లేదా చిన్న మొలకలు వస్తే, వాటిని పూర్తిగా పారేయాల్సిన అవసరం లేదు. కానీ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొలకలు వచ్చిన భాగాన్ని, ఆకుపచ్చగా మారిన భాగాన్ని లోతుగా కత్తిరించి పూర్తిగా తొలగించాలి. దుంప తొక్కను పూర్తిగా తీసివేయాలి, ఎందుకంటే గ్లైకోఅల్కలాయిడ్స్ ఎక్కువగా తొక్క కిందే కేంద్రీకృతమై ఉంటాయి.

టాక్సిన్స్ మోతాదు ఎక్కువైతే తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, గందరగోళం, జ్వరం, రక్తపోటు (BP) అకస్మాత్తుగా పడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా అరుదైనప్పటికీ, ఈ గ్లైకోఅల్కలాయిడ్స్ శరీరంలో ఎక్కువ మొత్తంలో చేరి, సరైన సమయంలో చికిత్స అందకపోతే గుండె వేగం పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

ఈ దుంపలను ఉడకబెట్టడం కంటే నూనెలో బాగా వేయించడం (Deep fry/Roast) మంచిది. వేయించడం వల్ల అందులోని గ్లైకోఅల్కలాయిడ్స్ పరిమాణం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పరిమిత పరిమాణంలో ఈ గ్లైకోఅల్కలాయిడ్స్ శరీరానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇవ్వడం, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వంటి కొన్ని ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, మొలకలు ఎక్కువగా ఉన్న బంగాళాదుంపలను మాత్రం పూర్తిగా దూరం పెట్టడమే ఆరోగ్యానికి క్షేమకరం.