
ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఎప్పుడు ఏదోక కొత్త ఫీచర్‌ను యూజర్లను ఆకట్టుకునేందుకు తీసుకొస్తున్న వాట్సప్.. ఈ సారి అదిరిపోయే ఫీచర్‌తో ముందుకొచ్చింది. అదే రీఛార్జ్ ఫీచర్. ఇక నుంచి మీరు మొబైల్ ప్రీపెయిడ్ సిమ్ రీఛార్జ్ కోసం యూపీఐ యాప్స్, టెలికాం వెబ్ సైట్లను సంప్రదించాల్సిన అవసరం. వాట్సప్‌లోనే సులువుగా సెకన్లలోనే రీఛార్జ్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇందులో చూద్దాం.

వాట్సప్ హోమ్ స్క్రీన్‌లో పైభాగాన రూపీ సింబల్ గుర్తు (₹)పై ట్యాప్ చేయండి. అక్కడ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకుని మీ మొబైల్ నెంబర్ లేదా మీరు ఎవరికైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెట్ వర్క్ ఎంచుకోండి. అనంతరం అక్కడ రీఛార్జ్ టారిఫ్ వివరాలు కనిపిస్తాయి. ప్లాన్ సెలక్ట్ చేసుకున్నాక యూపీఐ ద్వారా పేమెంట్ చేయండి.

పేమెంట్ చేయగానే మీ రీఛార్జ్ కంప్లీ్ట్ అవుతుంది. పేయూతో కలిసి ఈ సేవలను వాట్సప్ తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం కొంతమంది వాట్సప్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొంతమంది ఫోన్లలోనే ఇది కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అందరి వాట్సప్ అకౌంట్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా వేరే వేరే ఫ్లాట్‌ఫామ్స్‌కి వెళ్లి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.

వాట్సప్‌లోనే రీఛార్జ్ చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం స్కానర్, యూపీఐ ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం, మెట్రో టికెట్ బుకింగ్ వంటి సేవలు వాట్సప్‌లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సిమ్‌లకు రీఛార్జ్ చేసుకోవచ్చు. మీ కుటుంబసభ్యులకు కూడా రీఛార్జ్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పాటు ఐఓఎస్‌లో వాట్సప్ వాడుతున్న వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని మెటా ప్రకటించింది. టెస్టింగ్‌లో భాగంగా ప్రస్తుతానికి కొన్ని ఫోన్లలోనే దీనిని ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాట్సప్ యూజర్లకు ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు.