
వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు మూడు స్లీపర్ వెర్షన్ రైళ్లను ప్రవేశపెట్టారు. హౌరా-గువహతి, న్యూఢిల్లీ-వారణాసి, ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు తిరుగుతున్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు దశలవారీగా వీటిని విస్తరించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. సాధారణ వందే భారత్ రైళ్లతో పోలిస్తే ఈ స్లీపర్ రైళ్లల్లో అనేక రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. విమానం తరహాలో లగ్జరీ సౌకర్యాలు ఇందులో ఉంటాయి. మెరుగైన కుషనింగ్, బయో టాయిలెట్లు, మోడ్రన్ కిచెన్లు వంటి ఉంటాయి.

అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ ట్రైన్లకు ఇంజిన్లు ఉండవు. సాధారణంగా రైళ్లకు ముందు, వెనుక భాగంలో ఇంజిన్లు ఉంటాయి. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లు లాంటివి ఉంటాయి. వీటి ద్వారా వచ్చే శక్తిని ఉపయోగించుకుని రైళ్లు నడుస్తాయి. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లకు ఇంజిన్లు ఉండవు. కేవలం లోకో పైలట్ల కోసం క్యాబిన్లు మాత్రమే ఉంటాయి. మరి ఇంజిన్ లేకుండా ఈ రైళ్లు ఎలా నడుస్తాయనే అనుమానం అందరిలోనూ ఉంటుంది.

వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఇంజిన్లకు బదులుగా మోటార్లు ఉంటాయి. రైలు బోగీలకు వీటిని అమర్చుతారు. ఈ మోటార్ల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి ద్వారా రైలు పనిచేస్తుంది. ప్రతీ రెండో కోచ్ కింద ఒక మోటార్ జోడించి ఉంటుంది. ఉదాహరణకు 16 కోచ్‌లు ఉంటే 8 కోచ్‌లకు కింద భాగంలో మోటార్లు బిగించి ఉంటాయి. 4 మోటార్ల చొప్పున మొత్తం 32 అమర్చబడి ఉంటాయి. ఈ మోటార్లు అన్నీ కలిసి 12,870 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

రైలుకు శక్తిని అందించడానికి డ్రైవర్ క్యాబిన్‌పై ఒక పాంట్రోగ్రాఫ్ ఉంటుంది. ఇది 25,000 వోల్టుల కరెంట్‌ను స్వీకరించి కోచ్ కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు పంపుతుంది. కన్వర్టర్లు ఈ కరెంట్‌ను DC విద్యుత్‌గా మార్చి కోచ్‌లోని మోటార్లకు తక్కువ వోల్టేజ్ శక్తిని అందిస్తాయి. చక్రాల మధ్య ఉండే కప్లింగ్‌లు, గేర్ బాక్సుల ద్వారా అనేక చక్రాల మోటార్ల నుండి ఏకకాలంలో రైలు శక్తిని పొందుతుంది. ఈ శక్తి ద్వారా రైళ్లు కదులుతాయి.

రైళ్లు అత్యంత వేగంతో వెళ్తున్నా లోపల ఎలాంటి కుదుపులు రాకుండా కోచ్‌ల కింద స్టీల్ స్ప్రింగ్‌లు, డాంపర్లు ఉంటాయి. అన్ని కోచ్‌లు గాలితో నింపిన స్ప్రింగ్‌లపై ఉంటాయి. ఇవి కింద ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై స్థిరంగా ఉంటాయి. దీని వల్ల రైలు వేగం ఎంత స్పీడ్‌గా ఉన్నా.. లోపల ఉండేవారికి కుదుపులు ఉన్నట్లు అనుభూతి కలగదు. ఇక బ్రేకులు వేసినప్పుడు కింద ఉన్న మోటార్లు ట్రాన్స్ఫార్మర్లలా పనిచేసి విద్యుత్తును ఉత్పత్తి చేసి పంపుతాయి.