Subhash Goud |
Aug 30, 2021 | 12:48 PM
SBI Offer: భారతీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై ఆగస్టు 31వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు రేపటితో ముగియనుంది.
మాన్‌సూన్ ధమకా ఆఫర్ కింద పరిమిత కాలం వరకు హోమ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఛార్జీలను నూరు శాతం రద్దు చేస్తున్నట్లు బ్యాంకు గత నెలలో ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 0.40 శాతంగా ఉన్న ప్రాసెసింగ్ ఫీజు భారం వినియోగదారులకు తగ్గింది. ఈ ఆఫర్ ఆగష్టు 31 వరకు మాత్రమే ఉన్నందున.. రేపటితో గడువు ముగియనుంది.
అంతేకాకుండా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆఫర్ కింద 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) అదనపు వడ్డీ రాయితీని కూడా ఎస్‌బీఐ అందిస్తోంది. మహిళలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్లు రాయితీని ప్రకటించింది. ఎస్‌బీఐ గృహరుణం ప్రస్తుత ప్రారంభ వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంది.
డిపాజిట్లు, ఆస్తులు, శాఖలు, వినియోగదారులు, ఉద్యోగుల పరంగా చూస్తే దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ. బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు 30 లక్షల భారతీయ కుటుంబాలు ఇంటి రుణం పొందాయి.
బ్యాంకు గృహరుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. మార్కెట్‌లో గృహ రుణాల విభాగంలో 34.77 శాతం, వాహన రుణాల విభాగంలో 31.11 శాతం వాటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే. ఇక ప్రాసెసింగ్ ఫీజు రద్దు నిర్ణయం రేపటితో ముగియనుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చూడాలి.