
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) కోసం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి. దీంతో వరుసగా ఎనిమిదోసారి కూడా ఈ పథకాల రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రభుత్వం స్థిరత్వాన్ని కొనసాగించింది.

పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై వడ్డీ రేటు 7.1 శాతంగానే కొనసాగుతోంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ యథాతథంగా ఉంది. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, సురక్షిత పెట్టుబడులపై స్థిరమైన రాబడులు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇక బాలికల భవిష్యత్తు కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన (SSY)పై వడ్డీ రేటు 8.2 శాతంగా కొనసాగుతోంది. ఈ పథకం తల్లిదండ్రులకు దీర్ఘకాలికంగా మంచి రాబడులు అందించే సాధనంగా నిలుస్తోంది. అదేవిధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)పై 7.7 శాతం వడ్డీ కొనసాగుతుండగా మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతం రేటు అమల్లోనే ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగించే కిసాన్ వికాస్ పత్రా (KVP)లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ పథకం కింద పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతూ 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. ఇక నెలవారీ ఆదాయం కోసం ఎంపిక చేసే MIS పథకంపై 7.4 శాతం వడ్డీ కొనసాగుతోంది.

ప్రభుత్వం చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల వడ్డీ రేట్లను సవరించిన తర్వాత, గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత నిర్ణయం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, పెట్టుబడిదారులకు ముందస్తు అంచనాలు సులభతరం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్లలో మార్పులు లేకపోవడం కొంతమంది పెట్టుబడిదారులను నిరాశపరచే అవకాశం కూడా ఉంది.