
దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది. నగదు విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ తెరిచినవారికి నగదు విత్ డ్రా ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించేవారు కాదు.

ఇప్పటివరకు ఎన్ని నగదు ఉపసంహరణ లావాదేవీలు అయినా ఉచితంగా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్బీఐ పరిమితులు విధించింది. ఈ అకౌంట్ ఉన్నవారు అక్టోబర్ 1వ తేదీ నుంచి నెలకు నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ విత్ డ్రా లావాదేవీకి రూ.15 ఛార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు.

ఒక నెలలో నగదు ఉపసంహరణ లావాదేవీలు నాలుగు కంటే ఎక్కువ దాటినప్పుడు మాత్రమే ఛార్జీలు విధిస్తారు. అయితే డిజిటల్ లావాదేవీలు మాత్రం ఉచితంగా కొనసాగుతాయి. వీటికి ఎలాంటి ఛార్జీలు విధించమని ఎస్బీఐ తెలిపింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా ఉచితంగా లావాదేవీలు చేసుకోవచచ్చు.

బ్రాంచ్ ఛానెల్ ద్వారా బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ తెరిచినవారికి నగదు విత్ డ్రాకు సంబంధించి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే నెలకు నాలుగు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే అవకాశం ఉండటంతో.. దీని ప్రభావం పెద్దగా కస్టమర్లపై పడకపోవచ్చు. అయితే లిమిట్ దాటితే బ్యాంకింగ్ ఖర్చులు పెరిగే అవకాశముంది. ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవాలంటే డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడం మంచిది.

బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో అకౌంట్ అని అర్థం. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. ఉచితంగా ఏటీఎం కార్డు అందిస్తారు. అలాగే డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు కూడా ఎలాంటివి ఉండవు. బేసిక్ అకౌంట్ ఉండాలనుకునేవారికి ఈ ఖాతా ఉపయోగపడుతుంది.