
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పిడుగులాంటి వార్త. స్మార్ట్‌ఫోన్, టీవీ, ఏసీల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాదిలో కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించడంతో వీటి ధరలు దిగొచ్చి సామాన్యులకు ఊరట కలిగించాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పాటు దేశంలోనే తయారుచేయడం, టెక్నాలజీ పెరగడం వల్ల ధరలు తగ్గాయి. ఇక కేంద్రం ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల కూడా ధరలు తగ్గుతూ వచ్చాయని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది

అయితే స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్ల ఏసీల తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు గత కొద్ది నెలలుగా పెరుగుతున్నాయి. ఇక వాటిల్లో వాడే చిప్‌లకు కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. వచ్చే నెల నుంచి ధరలను మరింత పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ఖర్చులు పెరుగుతుండటం వల్ల ధరలను నియంత్రించలేకపోతున్నామని, తమ చేతుల్లో ఏమీ లేదని కంపెనీలు తేల్చేస్తున్నాయి.

ఎంట్రీ లెవల్ టీవీ, స్మార్ట్ ఫోన్ల ధరలతో పాటు వాషింగ్ మెషిన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 8 నెలల క్రిందట ఉన్న గరిష్ట స్థాయి ధరలకు మళ్లీ చేరుకోనున్నాయి. ధరలు రికార్డ్ స్థాయికి త్వరలో చేరుకోనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వేసవి సీజన్ కావడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్లు సేల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో సేల్స్ పెంచకపోతే ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ డిమాండ్ మరింత బలహీనపడవచ్చు.

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ధరలు గత ఏడాది దీపావళి సమయంలో రూ.10 వేల వరకు ఉండగా.. ఇప్పుడు రూ.14 వేలకు చేరుకోనున్నాయి. ఇక వచ్చే ఏడాది నాటికి రూ.18 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో కొన్ని బ్రాండ్ల బేసిక్ ఫోన్ ధరలు రూ.20 వేలకు చేరుకోవచ్చని చెబుతున్నారు. ఇక 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరలు గత ఏడాది రూ.6500గా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.8500కి చేరుకున్నాయి. మే లోపు రూ.10 వేలకు చేరుకోవచ్చంటున్నారు.

ఇక 1.5 టన్నుల 3 స్టార్ ఏసీల ధరలు గత ఏడాది రూ.32 వేలుగా ఉండగా.. ఇటీవల రూ.34 వేలకు చేరుకున్నాయి. ఇక ఏప్రిల్‌లో రూ.40 వేల వరకు చేరుకోవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే సమాన్య, మధ్యతరగతి ప్రజలకు షాకింగ్‌గా చెప్పవచ్చు. దీని వల్ల సేల్స్ పడిపోనున్నాయి.