
లగ్జరీ SUVల ప్రపంచంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. బలమైన నిర్మాణం, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ప్రీమియం డిజైన్ కారణంగా ఈ వాహనం చాలా మంది కార్ లవర్స్ డ్రీమ్‌కార్‌గా మారింది. అయితే ఈ SUVను కొనుగోలు చేయాలంటే దాని ధర మాత్రమే కాకుండా మొత్తం ఆర్థిక లెక్కలను కూడా ముందుగా అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో డిఫెండర్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.97 లక్షల నుంచి రూ.2.30 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన డిఫెండర్ 110 మోడల్ ఆన్-రోడ్ ధర సాధారణంగా రూ.1.15 కోట్ల నుంచి రూ.1.25 కోట్ల మధ్య ఉంటుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక లగ్జరీ కారు ధర వ్యక్తి వార్షిక ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ కాకూడదు.

EMI లెక్క ఇలా ఉంటుంది.. ఉదాహరణకు మీరు రూ.1.20 కోట్ల విలువైన డిఫెండర్‌ను కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఇందులో 20 శాతం డౌన్ పేమెంట్ చేస్తే ముందుగా సుమారు రూ.24 లక్షలు చెల్లించాలి. మిగిలిన రూ.96 లక్షలు బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంటే, అది 5 సంవత్సరాల కాలానికి, సుమారు 9 శాతం వడ్డీ రేటుతో ఉంటే, నెలవారీ EMI దాదాపు రూ.2 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

జీతం ఎంత ఉండాలి?.. ఆర్థిక నిపుణులు సాధారణంగా 50/30/20 రూల్ పాటించాలని సూచిస్తారు. ఈ నియమం ప్రకారం కారు EMI మీ చేతికి వచ్చే నెల జీతంలో 15 శాతం నుంచి 20 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే EMI రూ.2 లక్షలు ఉంటే, మీ నెలవారీ చేతి జీతం కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండటం సురక్షితంగా భావిస్తారు. కేవలం EMI మాత్రమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

వార్షిక సర్వీసింగ్ ఖర్చు రూ.60,000 నుంచి రూ.1 లక్ష, బీమా ప్రీమియం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, మైలేజ్ సాధారణంగా లీటరుకు 6 నుంచి 9 కిలోమీటర్లు, ఇంధన ఖర్చు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది.

మొత్తం మీద Land Rover తయారు చేసే డిఫెండర్ SUV కొనడం కేవలం విలాసవంతమైన ఎంపిక మాత్రమే కాదు, ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం కూడా. కాబట్టి EMIలు, నిర్వహణ ఖర్చులు, వ్యక్తిగత ఆదాయం మధ్య సరైన సమతుల్యత ఉండేలా ముందుగానే పూర్తి లెక్కలు వేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.