
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం కేవలం చమురు మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ఆహార భద్రతపై కూడా పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ముడి చమురు, గ్యాస్ ధరల పెరుగుదలపై ఎక్కువ చర్చ జరిగినప్పటికీ, నిజానికి పెద్ద ప్రమాదం ఎరువుల సప్లయ్ చైన్ అంతరాయం అని వారు చెబుతున్నారు. ఇది కొనసాగితే వచ్చే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి తగ్గి, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది.

సాధారణంగా మధ్యప్రాచ్యం అంటే చమురు ఉత్పత్తి గుర్తుకు వస్తుంది. కానీ సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, యూఏఈ వంటి దేశాలు ప్రపంచానికి యూరియా, సల్ఫర్, అమ్మోనియా వంటి కీలక ఎరువుల ప్రధాన సరఫరాదారులు కూడా. ముఖ్యంగా ఇరాన్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద అమ్మోనియా ఉత్పత్తిదారు. పంటల పెరుగుదలకు అవసరమైన ఎరువుల తయారీలో ఈ రసాయనం కీలకం. యుద్ధం కొనసాగితే ఈ దేశాల్లో ఉత్పత్తి, సముద్ర మార్గ రవాణా రెండూ దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఈ ప్రభావం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తోంది. కొన్ని ఎరువుల తయారీ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గడంతో పాటు, సముద్ర మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. యూరప్‌లో అమ్మోనియా ధరలు టన్నుకు సుమారు 725 డాలర్లకు చేరుకోగా, మధ్యప్రాచ్యంలో యూరియా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారు అయిన రష్యా కొంత కొరతను పూరించగలదని భావించినా, దాని ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగానే ఉంది. మరోవైపు చైనా ఫాస్ఫేట్ ఎగుమతులను నిలిపివేయడం, ఖతార్‌లో సల్ఫర్ ఉత్పత్తి తగ్గడం పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి.

ఈ పరిస్థితి భారతదేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం ప్రతి నెలా సుమారు 2 మిలియన్ టన్నుల ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా మురియేట్ ఆఫ్ పొటాష్ (MOP) కోసం భారత్ 100 శాతం దిగుమతులపై, అలాగే DAP కోసం సుమారు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలకు దాదాపు రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

మధ్యప్రాచ్యం నుంచి సరఫరా అంతరాయం ఏర్పడితే యూరియా ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని పెంచుకోవాల్సి రావచ్చు లేదా రైతులపై ఖర్చు భారం పెరిగే అవకాశం ఉంది. రైతులు తక్కువ ఎరువులు వాడితే లేదా ఖరీదైన కారణంగా పంటలు తగ్గిస్తే, ధాన్యం ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గి ఆహార ధరలు భారీగా పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.