
ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితి గురించి మరోసారి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రూ.15 వేల నుంచి రూ.20 వేలకు బేసిక్ శాలరీలు ఉన్నాయి. అయితే దేశవ్యా్ప్తంగా కనీస వేతనాలు పెరుగుతున్నా.. ఈపీఎఫ్‌వో బేసిక్ శాలరీ లిమిట్‌ను పెంచకపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు వస్తున్నా.. కేంద్రం అందుకనుణంగా నిర్ణయం తీసుకోవడం లేదు.

ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. నెలకు రూ.15 వేల వరకు జీతం పొందేవారు తప్పనిసరిగా ఈపీఎఫ్‌వో చేరాలి. ఆ పైన జీతం పొందేవారికి ఆప్షనల్ అవకాశం కల్పించారు. యజమాని, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పీఎఫ్ పథకంలో చేరవచ్చు. ప్రస్తుతం కనీస వేతాలు పెరుగుతున్న క్రమంలో బేసిక్ శాలరీ లిమిట్‌ను కూడా పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి రూ.15 వేలుగానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పెంచడం లేదు.

ఈ క్రమంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య తక్కువ జీతం పొందేవారు పీఎఫ్ సదుపాయానికి దూరం అవుతున్నారు. దీని వల్ల తక్కువ ఆదాయం పొందేవారికి కూడా సామాజిక భద్రత ఉండటం లేదు. దీంతో పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళను కూడా చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

ప్రస్తుతం కనీస వేతనాలు పెరుగుతున్న క్రమంలో రూ.15 వేల నిబంధన వల్ల చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ కవరేజీ లభించడం లేదు. ఇటీవల యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులకు కనీస వేతనాలను రూ.15 వేలకుపైగా పెంచింది. ఇక హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు బేసిక్ శాలరీని రూ.15,220కు పెంచింది.

ఇక ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కనీస వేతనాలు రూ.22 వేల వరకు చేరుకున్నాయి. దీంతో కేంద్రం రూ.25 వేలకు ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని పెంచడం వల్ల మరింత ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే యజమానుల నుంచి దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తోంది.