
ప్రతీ ఇంట్లో వంట అవసరాల కోసం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక సిలిండర్ సుమారు రెండు నెలల పాటు వస్తూ ఉంటుంది. ఇక ఎక్కువగా ఉపయోగిస్తూ నెల రోజులే వచ్చే అవకాశముంటుంది. ఇటీవల గృహ అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. దీని వల్ల సామాన్యులపై భారం పడుతోంది. దీంతో గ్యాస్‌ను ఆదా చేసుకునే చిట్కాల గురించి చాలామంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల మెటల్ గ్యాస్ సేవర్ స్టాండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్యాస్ పొదుపు చేసుకునేందుకు దీనిని చాలామంది ఉపయోగిస్తున్నారు. ఇది వాడటం వల్ల సిలిండర్ 15 రోజులు ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. నిజమేనని కొంతమంది చెబుతుండగా.. అవాస్తమవని మరికొందరు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. గ్యాస్ వృధా కాకుండా ఇది కాపాడుతుంది

ఎల్పీజీ బర్నర్‌పైన గ్యాస్ సేవర్ స్టాండ్ ఉంచుతారు. ఇది ఒక చిన్న లోహపు పరికరం. పాత్ర అంచుల చుట్టూ వేడి వ్యాపించకుండా ఈ స్టాండ్ మంటను ఎక్కువగా పాత్ర అడుగు భాగానికి మళ్లిస్తుంది. దీనివల్ల వంట చేసేటప్పుడు వేడి బదిలీ మెరుగ్గా జరుగుతుంది. వేడిని మెరుగ్గా ఉపయోగించుకోవడం వల్ల గ్యాస్ వృధా అయ్యే అవకాశం ఉండదని, దీని వల్ల ఎక్కువ రోజుల పాటు వచ్చే ఛాన్స్ ఉంటుందని కొంతమంది అంటున్నారు.

గ్యాస్ సేవర్ స్టాండ్ అనవసరమైన గ్యాస్ వినియోగాన్ని తప్పనిసరిగా తగ్గిస్తుంది. కానీ దీని వల్ల సిలిండర్ అదనంగా ఎక్కువ రోజులు వస్తుందని గ్యారెంటీ లేదు. మీరు ఎంత తరచుగా వంట చేస్తారు.. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. ప్రతిరోజూ మీ స్టవ్ ఎంతసేపు వాడుకలో ఉంటుంది అనే అంశాలపై మీ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. మీ ఇంట్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండి వంట ఎక్కువ చేస్తుంటే గ్యాస్ వినియోగం సహజంగానే ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువగా వంట చేస్తే.. గ్యాస్ సేవర్ స్టాండ్ ఉన్నా సిలిండర్ ఎక్కువ కాలం రాదు. అయితే మీరు కొన్ని చిట్కాలు పాటించి గ్యాస్ సేవర్ స్టాండ్ ఉపయోగిస్తే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. బర్నర్‌లను శుభ్రంగా ఉంచడం, సరైన పరిమాణంలో ఉన్న పాత్రలను ఉపయోగించడం, వంట చేసేటప్పుడు పాత్రలపై మూతలు పెట్టడం, అనవసరంగా అధిక మంటలను నివారించడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.