
ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రెడిట్ కార్డులు నేడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు విస్తృతంగా కార్డులు జారీ చేస్తుండడంతో వినియోగం పెరిగింది. అయితే సరైన అవగాహన లేకుండా వాడుతున్న చాలామంది వినియోగదారులు అనుకోకుండా అప్పుల ఊబిలో పడుతున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డు సురక్షిత వినియోగానికి కొన్ని కీలక పదాలపై స్పష్టమైన అవగాహన అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

APR.. క్రెడిట్ కార్డు బిల్లును గడువు తేదీకి ముందే పూర్తిగా చెల్లించకపోతే మిగిలిన మొత్తంపై పడే వార్షిక వడ్డీ రేటును APR (Annual Percentage Rate) అంటారు. సాధారణంగా ఇది 36 శాతం నుంచి 42 శాతం వరకు ఉండొచ్చు. కొనుగోళ్లు, క్యాష్ అడ్వాన్స్‌లకు వేర్వేరు రేట్లు ఉండవచ్చు.

య్యానువల్ ఫీ అండ్ క్రెడిట్ లిమిట్.. కార్డు వినియోగానికి బ్యాంకులు వసూలు చేసే ఫీజును య్యానువల్ ఫీ అంటారు. కొన్ని కార్డుల్లో ఇది మాఫీ అవుతుంది. ఇక కార్డు ద్వారా ఖర్చు చేయగల గరిష్ఠ మొత్తాన్ని క్రెడిట్ లిమిట్ అంటారు. ఇది ఆదాయం క్రెడిట్ స్కోర్ ఆధారంగా నిర్ణయిస్తారు.

మినిమమ్ డ్యూ.. బిల్లులో చూపించే కనీస బకాయి (సాధారణంగా 5 శాతం) మాత్రమే చెల్లిస్తే లేట్ ఫీజు తప్పించుకోవచ్చు. కానీ మిగిలిన మొత్తంపై అధిక వడ్డీ పడుతుంది. అందుకే పూర్తి బిల్లు చెల్లించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బిల్లింగ్ సైకిల్ అండ్ గ్రేస్ పీరియడ్.. ప్రతి 28–31 రోజులకు బిల్లింగ్ సైకిల్ ముగిసి స్టేట్‌మెంట్ వస్తుంది. బిల్ తేదీ నుంచి డ్యూ డేట్ వరకు ఉన్న వ్యవధినే గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో పూర్తి బిల్లు చెల్లిస్తే వడ్డీ ఉండదు.