
బ్రెజిల్ లో ఈ నెల 5 నుంచి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థ, గరుడ ఆర్జిలరీ తుపాకులు కొనుగోలు చేయడానికి ఆయనతో బ్రెజిల్ అధికారులు చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (తూర్పు) పి.కుమరన్ ఇటీవల విలేకరులకు తెలిపారు.

మన దేశం డెవలప్ చేసిన మరికొన్ని అంశాలు, సాంకేతికతపై బ్రెజిల్ ఆసక్తి చూపుతోంది. యుద్దభూమిలో మన ఉపయోగించే సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆఫ్ ఫోర్ పెట్రోల్ నౌకలు (ఓపీవీ) వాటిలో ముఖ్యమైనవి. అలాగే ఆ దేశంలోని స్కార్పీన్ జలాంతర్గాములను నిర్వహించడపై మనతో భాగస్వామి కావాలని కోరుకుంటోంది.

బ్రెజిల్ తో రక్షణ సహకారం, దాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరుగుతాయి. ఉమ్మడి పరిశోధన, సాంకేతిక భాగస్వామ్యం, శిక్షణ మార్పిడి తదితర అంశాలను పరిశీలిస్తారు. మనతో కలిసి రక్షణ పరిశ్రమ జాయింట్ వెంచర్లు తయారు చేయడానికి బ్రెజిల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

దేశ రక్షణ పరిశోధన, డెవలప్మెంట్ సంస్థ (డీఆర్డీవో) అనేక రక్షణ వ్యవస్థ, ఆయుధాలను రూపొందించింది. వాటిలో ఆకాశ్ క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, విదేశీ వైమానిక దాడులను అడ్డుకునే మధ్యస్థ శ్రేణి వ్యవస్థ ముఖ్యమైనవి. ఈ రక్షణ వ్యవస్థ పరిధి సుమారు 25 నుంచి 45 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ఢీకొంటుంది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాశ్ రక్షణ వ్యవస్థ చాలా కీలకంగా మారింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన అన్ని డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా అడ్డుకుని నాశనం చేసింది.. అదే సమయంలో మనం వదిలిన క్షిపణులు పాకిస్థాన్ లో కీలక ప్రాంతాలను నాశనం చేశాయి. ఉగ్రవాద శిబిరాలతో పాటు వారి వైమానిక కేంద్రాలను ధ్వంసం చేశాయి. గరుడ ఫిరంగి వ్యవస్థ కూడా సమర్థంగా పనిచేసింది.