
సకాలంలో చెల్లింపులు: మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అతిపెద్ద అంశం ఇదే. మీ అన్ని బిల్లులను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. ఆలస్య చెల్లింపులు మీ స్కోర్‌ను తీవ్రంగా తగ్గిస్తాయి.దీని కోసం మీరు మీ ఫోన్‌లో రిమైండర్‌లను సెట్ చేసుకోవచ్చు లేదా బ్యాంకులో ఆటో-పే ఎంపికను ఉపయోగించడం ఉత్తమం.

క్రెడిట్ వినియోగం: మీ క్రెడిట్ కార్డుపై ఉన్న మొత్తం పరిమితిలో మీరు ఎంత డబ్బును ఉపయోగిస్తున్నారనేది చాలా ముఖ్యం. దీనిని క్రెడిట్ వినియోగ నిష్పత్తి అంటారు. మీరు మీ పరిమితిలో 30శాతం కంటే తక్కువ మాత్రమే ఉపయోగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు.. మీ క్రెడిట్ పరిమితి రూ.1 లక్ష అయితే మీరు రూ.30,000 కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. తక్కువ వినియోగం అంటే మీరు బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తున్నారని రుణదాతలకు చూపిస్తుంది.

క్రెడిట్ మిశ్రమం: బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవడానికి మీ రుణాలలో మంచి లోన్స్ ఉండేలా చూసుకోవాలి. సెక్యూర్డ్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ రెండూ కలిగి ఉండటం ముఖ్యం. మీరు వివిధ రకాల రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని ఇది చూపిస్తుంది. ఇది స్కోర్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

తరచుగా దరఖాస్తులు: మీరు తరచుగా కొత్త లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ క్రెడిట్ నివేదికపై హార్డ్ ఎంక్వైరీ పడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. తరచుగా చేసే దరఖాస్తులు మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే సందేశాన్ని పంపి స్కోర్‌ను తగ్గిస్తాయి. మీరు మీ స్కోర్‌ను చెక్ చేసుకునేటప్పుడు జరిగేది సాఫ్ట్ ఎంక్వైరీ. దీని వల్ల మీ స్కోర్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు.

క్రెడిట్ నివేదిక: ప్రతి నెలా లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఏవైనా లోపాలు తప్పుడు సమాచారం లేదా మీకు తెలియని నకిలీ ఖాతాలను గుర్తిస్తే వాటిని వెంటనే CIBIL సంస్థకు ఫిర్యాదు చేసి సరిచేయండి. సరైన, పారదర్శకమైన సమాచారం కలిగి ఉండటం వల్ల మీ స్కోర్ పెరుగుతుంది.